. డిప్యుటేషన్ రిలీవ్ చేయాలని ఒత్తిళ్ళు
. స్పెషల్ ఆఫీసర్ పేరిట జెడ్పీ అధికారుల బెదిరింపు
నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడా బోధనేతర సిబ్బంది లేరని పలు స్కూళ్ళ నుంచి దరఖాస్తులు అందుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా అటు విద్యాశాఖ, ఇటు జిల్లా పరిషత్ తమ వద్ద సరిపడా ఉద్యోగుల సంఖ్య లేదని అడ్జెస్ట్ చేసుకోవాలని చెప్పడం మామూలు విషయంగా మారిపోయింది. కానీ ఒక్కోచోట విద్యార్థుల సంఖ్యతో బోధన, బోధనేతర సిబ్బంది సంఖ్యకు ఏ మాత్రం పొంతన ఉండడం లేదు. హైస్కూల్ స్థాయి పాఠశాలలో మాత్రం పదో తరగతి పరీక్షలను పరిగణనలోకి తీసుకుని ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు డిప్యుటేషన్ ఇవ్వడమనేది సర్వసాధారణం. కానీ బోధనేతర సిబ్బంది విద్యార్థుల సంఖ్య కంటే ఎక్కువగా ఉండడమనేది అరుదుగా చూస్తుంటాం. అయితే నందిపేట్ మండలం ఆంధ్రనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 53 మంది విద్యార్థులు ఉండగా ముగ్గురు రికార్డు అసిస్టెంట్లను నియమించడం జిల్లా పరిషత్ అధికారులకే చెల్లింది. జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ప్రత్యేకాధికారి పేరు చెప్పి ఇది వరకే ఇద్దరు రికార్డు అసిస్టెంట్లు ఉండగా సంబంధం లేని డివిజన్ నుంచి మరొకరికి ఆంధ్రనగర్ కు డిప్యుటేషన్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రనగర్ జెడ్పీహైస్కూల్ లో ఇది వరకే ఒక రికార్డు అసిస్టెంట్ రెగ్యులర్ ప్రాతిపదికన పని చేస్తున్నారు. ఇటీవల ఒక అటెండర్ కు రికార్డు అసిస్టెంట్ గా పదోన్నతి ఇచ్చి ఆంధ్రనగర్ కు పోస్టింగ్ ఇచ్చారు. ఆ తరువాత ఇటీవల కాలంలో కోటగిరి నుంచి మరొక రికార్డు అసిస్టెంట్ ను ఆంధ్రనగర్ కే కేటాయించడం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. మెడికల్ గ్రౌండ్ పేరిట డిప్యుటేషన్ ఇచ్చి ఆంధ్రనగర్ కు పదోన్నతిపై వచ్చిన రికార్డు అసిస్టెంట్ కోసం అప్పటికే అక్కడ ఉన్న రికార్డ్ అసిస్టెంట్ ను మోస్రాకు డిప్యుటేషన్ వేయడం ఏమిటని ఉపాధ్యాయులు చర్చించుకుంటున్నారు. ఇటీవల కాలంలో కోటగిరి నుంచి డిప్యుటేషన్ పై వచ్చిన రికార్డు అసిస్టెంట్ ను ఆంధ్రనగర్ లో జాయిన్ చేసుకునేందుకు అక్కడున్న రికార్డు అసిస్టెంట్ ను మోస్రా స్కూల్ కు రిలీవ్ చేయాలని ఒత్తిళ్లు పెరిగాయి. సంబంధిత హెడ్ మాస్టార్ సెలవులో ఉండగా ఇన్ చార్జీపై జిల్లా పరిషత్ నుంచి ఒత్తిడిపెంచారు. రెగ్యులర్ హెడ్ మాస్టర్ లేకపోయినప్పటికీ ఇన్ చార్జి ఉన్న సరే రిలీవ్ చేయాలని ఆదేశాలు రావడంతో ఇన్ చార్జీ చేతులెత్తేసినట్లు తెలిసింది. స్పెషల్ ఆఫీసర్ ఆధేశాల మేరకు డిప్యుటేషన్ ఇచ్చారని అక్కడున్న రెగ్యులర్ రికార్డు అసిస్టెంట్ ను డిప్యూటేషన్ పంపాలని ఫోన్ లలోనే ఒత్తిడి తెస్తున్న వ్యవహారంతో ఉపాధ్యాయులు షాక్ కు గురవుతున్నారు. అవసరం ఉన్న చోట ఒక్క రికార్డు అసిస్టెంట్ లేరని విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ఇద్దరు రెగ్యులర్ రికార్డు అసిస్టెంట్ ఉండగా డిప్యుటేషన్ ఏ విధంగా ఇస్తారని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. కొందరు యూనియన్ నాయకులు పొలిటికల్ ఒత్తిడి తో అవసరం లేకపోయినా డిప్యుటేషన్ వేయించడమే కాకుండా అక్కడున్న వారిని రిలీవ్ చేయాలని ఒత్తిళ్ళు తెస్తున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు.