25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పర్యవేక్షణ లోపించింది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రభుత్వాసుపత్రుల్లో తగ్గిన ప్రసవాలే నిదర్శనం

 

. . . మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పర్యవేక్షణ లోపించిందని, మందుల లభ్యత తగ్గిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. బాన్సువాడ మాతా – శిశు ఆసుపత్రిలో సిజేరియన్ శస్త్రచికిత్సల అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింతలను ఆయన  సోమవారం పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని నిమ్స్ వైద్యులను అడిగి తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నెల 13 న బాన్సువాడ ఆసుపత్రిలో ప్రసవాల కోసం వచ్చిన 10 మంది మహిళలకు సిజేరియన్ ఆపరేషన్లు చేసిన తర్వాత ఇన్ఫెక్షన్లు సోకడంతో పరిస్థితి విషమించిందని తెలిపారు. తొలుత వారిని నిజామాబాద్ ఆసుపత్రికి, అనంతరం నిమ్స్‌ కు తరలించారని చెప్పారు. ప్రస్తుతం ఫాతిమా, రుక్సానా, జ్యోతి, లక్ష్మీప్రియ, సునీత అనే ఐదుగురు బాలింతలు నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వారిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, తెల్ల రక్త కణాలు తగ్గడం, ఊపిరితిత్తులు, కిడ్నీలలో ఇన్ఫెక్షన్ల కారణంగా ఐసీయూలో డయాలసిస్ అందిస్తున్నారని పేర్కొన్నారు. బాన్సువాడ ఘటన జరిగి 10 రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని ఆయన ఆరోపించారు. ఏ మంత్రి, ఎమ్మెల్యే లేదా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి బాధితులను పరామర్శించలేదని విమర్శించారు. ఈ ఘటనకు కారణాలపై సమగ్ర విచారణ జరపాలని, నిర్లక్ష్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ థియేటర్ నిర్వహణ లోపాల వల్లే ఇన్ఫెక్షన్లు సోకినట్లు బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయని తెలిపారు. కాలం చెల్లిన మందులు వాడటం వల్ల సమస్యలు తలెత్తాయని కొందరు బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారని చెప్పారు. నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం ఒక కుటుంబం రెండు రోజుల్లోనే రూ.3 లక్షలు ఖర్చు చేసిందని, బంగారం అమ్ముకుని, అప్పులు చేసి వైద్యం చేయించినా పరిస్థితి మెరుగుపడలేదని పేర్కొన్నారు. బాధిత బాలింతలకు పూర్తి స్థాయి వైద్యం అందించాలని, వారికి తగిన పరిహారం (ఎక్స్‌ గ్రేషియా) ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గర్భిణీలు, బాలింతల కోసం న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ వంటి పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం పెంచామని, ప్రస్తుతం మళ్లీ తగ్గిందని అన్నారు. సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య పెరగడం, ఆసుపత్రుల పర్యవేక్షణలో వైఫల్యం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.

 

There is a lack of supervision in government hospitals.

 

. . . ఖమ్మం ఘటనలో బాధిత బాలికకు పరామర్శ

ఖమ్మంలో దాడికి గురైన మైనర్ బాలికను కూడా నిమ్స్‌ లో పరామర్శించినట్లు తెలిపారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పినట్లు వెల్లడించారు. బాలిక పరిస్థితి తీవ్రంగా ఉందని, నడుము కింది భాగం పనిచేయకపోవడంతో భవిష్యత్తులో వీల్‌చైర్‌కే పరిమితం కావాల్సి రావచ్చని వైద్యులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ బాలిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కనీసం రూ.25 లక్షల ఎక్స్‌ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో పర్యవేక్షణ వ్యవస్థ బలహీనపడిందని, రివ్యూలు, జవాబుదారితనం తగ్గాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఏదైనా ఆరోగ్య సంబంధిత ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణకు ఆదేశించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అన్నారు.

 

There is a lack of supervision in government hospitals.

More articles

Latest article