27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యార్థుల సంక్షేమానికి ఎనలేని ప్రాధాన్యత ఇవ్వాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల భద్రత, సంక్షేమానికి ఎనలేని ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, హాస్టళ్ల ప్రాంతీయ సమన్వయకర్తలు (ఆర్.సీ.ఓ)లు, నిర్వాహకులతో కలెక్టర్ సమీక్ష జరిపారు. ఇటీవల కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న సంఘటనలను ఉటంకిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తరహా ఉదంతాలు చోటు చేసుకోకుండా పిల్లల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి బాలికల వసతి గృహాలు, గురుకులాల నిర్వహణ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. బాలికల హాస్టళ్లలో ఇతరులు ఎవరూ ప్రవేశించకుండా కట్టడి చేయాలని, తల్లిదండ్రులు వస్తేనే వారి వెంట ఇంటికి పంపాలని సూచించారు. సీ.సీ కెమెరాలు తప్పనిసరిగా పని చేయాలని అన్నారు. వసతి గృహాల ప్రాంగణాలు, పరిసరాలలో ఎక్కడైనా గుంతలు వంటివి ఉంటే తక్షణమే పూడ్చి వేయించాలని అన్నారు. పరిసరాల పరిశుభ్రత, శుభ్రమైన నీటి సరఫరా, ఆహార పరిశుభ్రత, పౌష్టిక ఆహారం అందించడానికి కావలసినటువంటి ఏర్పాట్లను అనునిత్యం పర్యవేక్షించాలన్నారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలోని పరిసర ప్రాంతాలలో పిచ్చి మొక్కలు, గడ్డి వంటివి  పెరగకుండా చూడాలని, పాముకాటు వంటి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. క్రమం తప్పకుండా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలన్నారు. మెనూ ప్రకారం శుభ్రమైన ఆహార పదార్థాలను అందించడానికి వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించడానికి, కలుషిత ఆహారం ద్వారా వ్యాధులు సోకకుండా ఫుడ్ పాయిజన్ సమస్యను నివారించడానికి శానిటేషన్ సిబ్బందికి, వంటగదిలో పని చేసే సిబ్బందికి తగిన సూచనలు చేయాలన్నారు. వంట పాత్రలు శుభ్రంగా కడిగేలా పర్యవేక్షణ జరపాలని, నిల్వ ఉంచిన నాన్ వెజ్ ను అందించకూడదని ఆదేశించారు. విద్యార్థులతో ఆప్యాయంగా వ్యవహరిస్తూ, తమ సొంత బిడ్డలుగా వారి సంక్షేమానికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్, ఆర్.సీ.ఓలు, హాస్టళ్ల నిర్వాహకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

 

 

The welfare of students should be given utmost priority.

More articles

Latest article