జీతం మూరెడు.. పని బారెడు..

0 2,586
  • ఉద్యోగ భద్రత కరువు, ఇతర రాష్ట్రాల్లో పర్మనెంట్
  • కేంద్రం వాటా 60, రాష్ట్ర వాటా 40
  • గురుకులాల మాదిరే బోధన, వేతనాల్లో తేడా
  • సౌకర్యాలకు నోచుకోకుండా ఏళ్లుగా వెట్టిచాకిరి 
  • ఎస్ఎస్ఏ ఉద్యోగులు  సమ్మె మొదలెట్టి 20 రోజులాయే

హైదరాబాద్, బతుకమ్మ:   సమగ్ర శిక్ష అభియాన్  సిబ్బందికి పని భారం ఎక్కువ,  వేతనం తక్కువ ఉంది.  కేంద్రం వాటాగా 60 శాతం నిధులు ఇవ్వగా రాష్ట్రం 40 శాతం ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్రం ఇచ్చే 60 శాతంలోనూ సగం రాష్ట్రం కోత విధిస్తుండడంతో  ఏళ్లుగా పని చేస్తున్న అదే వేతనం తీసుకోవాల్సిన అగత్యం ఎస్ఎస్ఏ వారికి  పట్టింది. డ్రాప్ అవుట్ [మద్యలో చదువు మానేసిన బాలికలు] పిల్లల చదువులు మధ్యంతరం కాకూడదనే ఉద్దేశంతో మంచి లక్ష్యంతో  కేంద్ర ప్రభుత్వం కెజిబివి పథకాన్ని 2004-05 సంవత్సరంలో ప్రవేశపెట్ట్టింది. తెలంగాణా రాష్ట్రంలో 475 కెజిబివిలు నెలకొల్పబడ్డాయి. దీనిలో బోధన, బోధనేతర సిబ్బందిని నియమించగా అందరి సహకారంతో శ్రమకోడ్చి విద్యాలయాలను నిలబెట్టారు.  అప్పటి నుంచి విద్యా పరంగా ఫలితాలు అనుకూలంగా రావడంతో కొన్ని పాఠశాలలను ఇంటర్మీడియట్ స్థాయికి పెంచారు.

పెరగని వేతనాలు:   కేంద్ర, రాష్ట్రాల్లో వేతన సవరణలు జరిగినా ఎస్ఎస్ఏ వారికి మాత్రం అలాంటివేమి ఉండట్లేదు. ఒప్పంద [కాంట్రాక్ట్] విధానంలో విధులలో ఉన్నవారికి వారి హోదా ప్రకారం  కనీస వేతనం  వర్తింపజేయాలని 2018 పిఆర్సి  కమిటి సూచించింది.  ఇతర శాఖలలో వేతన సవరణ జరిగుతోంది. విద్యా శాఖకు అనుబంధంగా ఉన్న ఎస్ఎస్ఏలో అమలు కావడం లేదు. 20 ఏళ్లుగా పని చేస్తున్నా మొదట్లో ఎంతిచ్చారో ప్రస్తుతం అంతే చెల్లిస్తున్నారు. కెజిబివి ప్రత్యేక అధికారిణి  హోదా  గురుకుల ప్రిన్సిపల్ స్థాయికి  ఉంటుంది. జీతం మాత్రం రూ.32 వేలు కాగా అదే ప్రిన్సిపల్ కు రూ.58 వేలు చెల్లిస్తున్నారు. ఆఫీస్ సబ్ఆర్డినేటర్ కు రూ.10 వేల లోపే ఇస్తున్నారు.  కనీసం కేంద్రం చెల్లించే వాటినైనా ఇస్తే జీతాలలో హెచ్చు ఉండేది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అల్ప జీతాలు చెల్లించి ఉద్యోగులను క్రమబద్ధికరిస్తామని చెప్తూ కాలం  వెల్లదీసిందనే ప్రచారం జరుగుతోంది.

గురుకులాలకు ధీటుగా:  తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ వర్గాలకు చెందిన గురుకులాలకు ధీటుగా కెజిబివి [కస్థూర్భ గాంధీ బాలికల విద్యాలయం] లు పని చేస్తున్నాయి. అందులో ఉన్న మాదిరిగానే  విధుల నిర్వహణ, మెను  ఉన్నాయి. ఒక రకంగా చూస్తే కెజిబివి అయినప్పటికీ గురుకులాలతో సమానంగా విధులు నిర్వహించి ఫలితాలను రాబట్టుతున్నారు. అయా జిల్లాల్లో పదిలో వచ్చిన ఫలితాల ఆధారంగా వీటి స్థాయిని కళాశాలలుగా మార్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ౩౦౦ పై చిలుకు పాటశాలలను ఇంటర్ స్థాయికి పెంచారు.

ఉద్యోగ భద్రత కరువు:  ఇంత చేస్తున్న ఉద్యోగానికి భద్రత ఉందంటే అదీ లేదు. పాఠశాలల్లో పనిచేసే వారికి విరమణ వచ్చిందని చెప్పి లేఖ చేతిలో పెట్టి  శాలువ కప్పి సన్మానిస్తున్నారు. ఆ రోజున ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లుగా బెనిఫిట్స్[సౌకర్యాలు] ఏమి ఇవ్వకపోవడంతో ప్రస్స్తుతం పని చేస్తున్న సిబ్బంది, జరుగుతున్న  సంఘటనలను  తలచుకొని  రేపు తమ పరిస్థితి ఇంతేనా అని  ఆవేదన చెందుతున్నారు. కెజిబివిలో  పై నుంచి కింది వరకు మహిళా సిబ్బందే ఉంటారు. వీరికి ఆరోగ్య సమస్యలు అనేకంగా ఉంటాయి. అనారోగ్య  సమస్యలు వచ్చిన సిబ్బందికి సౌకర్యాలు లేవు.  చాలిచాలని జీతం నుంచి ఆసుపత్రికి చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కామారెడ్డి జిల్లాలోని నాగిరేడ్డిపేట్ మండల్ లో పనిచేసే బయో ఉపాద్యాయురాలికి ప్రమదం జరిగితే కూతురు, కొడుకు మృతి చెందారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ఉభయ జిల్లాల్లో ఉన్న కెజిబివి సిబ్బంది చందాలు వేసి ప్రమాద ఘటన టీచర్ కు ముట్టజెప్పారు. న్యాయమైన డిమాండ్ల కోసం 20 రోజులుగా సమ్మెకు తన భాద్యతగా హాజరవుతున్న ఒక మహిళామణి వారం  రోజుల కింద హఠాన్మరణం పొందారు. గాలిలో దీపంలా ఉన్న తమ జీవితాలకు  భద్రత ముఖ్యమని పోరాటం చేస్తున్నారు.

ఇతర రాష్ట్రాల్లో క్రమబద్ధికరణ : అప్పటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం నెలకొల్పబడిన కెజిబివిలలో పని చేస్తున్న సిబ్బందిని కొన్ని ముఖ్యమైన రాష్ట్రాలలో క్రమబద్ధీకరించారు. దీని వల్ల విద్యాలయాల్లోని సిబ్బందితో పాటు పాలన పరంగా విధులు నిర్వహించేవారికి ప్రభుత్వ ఉద్యోగులకు అందే విధంగా జీతాలు, సౌకర్యాలు అందుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నమ్మించి నట్టేట ముంచిందని ఆలస్యంగా గ్రహించిన నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ లో జరుగుతున్న బహిరంగ సభకు చేరుకొని ప్రస్తుత ముఖ్యమంత్రిని కలిసి విన్నవించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే పర్మనెంట్ [క్రమబద్ధికరణ] చేస్తామని హామీ ఇచ్చారు. దీని విషయమై సిఎంను ఎస్ఎస్ఏ నాయకులు పలు దఫాలుగా కలిసి హామీ గురించి ప్రస్తావన తీసుకోచ్చారు. ప్రభుత్వ్వం నుంచి ఎలాంటి స్పందన  లేకపోవడంతో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టారు. ఎస్ఎస్ఏ ఉద్యోగుల వేదనను సిఎం  అర్థం చేసుకుని తమకు న్యాయం  చేస్తారనే నమ్మకంలో ఉన్నారు.

పిల్లలు చదువుకు దూరం : తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు 20 రోజులుగా సమ్మెలో  కూర్చుంటున్నారు. దీని వల్ల కెజిబివి, యుఆర్ఎస్ లలో చదివే పిల్లలు విద్యకు దూరం అవుతున్నారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయని, బోధన లేకపోతే చదువు ఎలా కొనసాగుతుందని పిల్లలు, వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.  ప్రభుత్వం స్పందించి ఎస్ఎస్ఏ సిబ్బందికి మేలు జరిగే విధంగా ఉత్తర్వుల రూపంలో హామీ ఇస్తే పిల్లలకు భోధన మొదలవుతుందనే అభిలాషను తల్లిదండ్రులు వ్యక్తపరుస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.