- ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి అక్బర్ నగర్ గ్రామస్తుల వినతి
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో ఉన్న హనుమాన్ ఆలయంలో పూజలు చేసి దర్శించుకునేందుకు వెళ్లి రావడానికి సౌకర్యంగా ఉన్నటువంటి ప్రభుత్వ రికార్డు ప్రకారం 12 పీట్లు గల పాత రోడ్డు స్థలాన్ని గ్రామానికి చెందిన ఓ నాయకుడు అక్రమంగా కబ్జా చేసి తన పేరిట అక్రమ మార్గంలో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కుట్ర పన్నుతున్నాడు. ఈ విషయం పై గురువారం బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని అక్బర్ నగర్ గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి సమస్యను విన్నవించారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. సుమారు 80 ఏళ్ల నుంచి గ్రామానికి చెందిన భక్తులు దర్శనం కోసం హనుమాన్ ఆలయానికి పాత రోడ్డు గుండానే రాకపోకలు సాగిస్తున్నారని, అంతేకాకుండా ఊర చెరువు ఆయకట్టు కింద ఉన్న వ్యవసాయ భూములలో పంటలు పండించి, అట్టి పంట ఉత్పత్తులను తీసుకొనిరావడానికి గ్రామ రైతులు కూడా హనుమాన్ ఆలయం రోడ్డు గుండానే రాకపోకలు సాగించేవారన్నారు. ముఖ్యంగా మహిళలు, ఆడపిల్లలు ఈ ఆలయానికి వెళ్ళి దర్శించుకోవడానికి పాత దారి మాత్రమే ఎంతో సౌలభ్యకరంగా ఉండెను. గ్రామస్థులందరికీ సౌకర్యవంతంగా ఉన్నటువంటి పాత రోడ్డు స్థలాన్ని గ్రామానికి చెందిన ఓ నాయకుడు అక్రమంగా కబ్జాకు పాల్పడుతుండగా, ఇది సరైన పద్ధతి కాదని చెప్పాల్సిన బాధ్యతను విస్మరించిన కొందరు గ్రామ పెద్దలు వాస్తవాలను వక్రీకరించి కబ్జాదారుడికే వత్తాసు పలుకుతున్నారు. అయితే కబ్జా నుంచి పాత దారికి విముక్తి కల్పించి తిరిగి పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. గత ఆరు నెలల క్రితం బోధన్ సబ్ కలెక్టర్ కు, రుద్రూర్ ఎంపిడివో కు, తహశీల్దార్ కు కూడా వినతి పత్రాలు సమర్పించామన్నారు. అయినా కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవుని పేర్కొన్నారు. కావున ప్రభుత్వ రికార్డులో హనుమాన్ ఆలయానికి 12 ఫీట్లు రోడ్డు ఉన్నందున, ముఖ్యంగా మహిళా భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని హనుమాన్ ఆలయానికి వెళ్ళే పాత రోడ్డును వెంటనే పునరుద్ధరించేందుకు తగు చర్యలు తీసుకొని, తద్వారా గ్రామస్థులందరికీ న్యాయం చేయగలరని కోరారు.
