28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . డీఎంహెచ్‌వో డా.బి.రాజశ్రీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జాతీయ పోలియో దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ బి. రాజశ్రీ అధికారులను ఆదేశించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని సూచించారు. జూన్ 28న పోలియో బూత్‌ల వద్ద, జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయని పిల్లలను గుర్తించి మందు అందించాలని తెలిపారు. ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రదేశాలు, తాండాలు, మారుమూల ప్రాంతాల్లో నివసించే పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని, మొదటి రోజే 90 శాతానికి పైగా లక్ష్యాన్ని సాధించాలని పేర్కొన్నారు. టిబి ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా క్షయరహిత గ్రామాలతో పాటు పట్టణాల్లో క్షయరహిత వార్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో క్షయ రోగులకు ఉచిత పోషకాహార కిట్లు పంపిణీ చేయాలని కోరారు. హెచ్ఎంఐఎస్, ఎంసిహెచ్, ఎన్‌సీడీ, యూవిన్, ఆమ్ పోర్టల్‌లలో నమోదులను సకాలంలో పూర్తి చేయాలని, ఆధార్ ఆధారిత హాజరు (ఆబాస్)ను 100 శాతం నమోదు చేయాలని ఆదేశించారు. జీవనశైలి వ్యాధుల నియంత్రణలో భాగంగా గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 932 క్యాన్సర్ కేసులు నమోదైనట్లు వెల్లడించిన ఆమె, ప్రతి కేసును సంబంధిత వైద్యాధికారులు సమీక్షించి నిర్ధారించుకోవాలని సూచించారు. జిల్లాలో 30 సంవత్సరాల పైబడిన జనాభా 52 శాతం ఉందని, వారికి హైపర్‌టెన్షన్, మధుమేహం, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని అన్నారు. టీకాల ద్వారా వ్యాధుల నివారణలో భాగంగా పోలియో, మీజిల్స్ అనుమానిత కేసుల నమూనాలను పరీక్షల కోసం పంపించాలని ఆదేశించారు. ప్రమాదకర లక్షణాలు గల గర్భిణులను ముందుగానే గుర్తించి, ప్రసవ ప్రణాళిక రూపొందించి అవసరమైతే ఉన్నత వైద్య కేంద్రాలకు రిఫర్ చేయాలని సూచించారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో రోజుకు కనీసం 60 మంది ఓపీ రోగులకు సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల ప్రయోజనాలు ప్రతి గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేయాలని డీఎంహెచ్‌వో పిలుపునిచ్చారు. సమావేశంలో డీటీసీవో డాక్టర్ బేబీ నాగేశ్వరి, ఏవో సుమంత్ కుమార్, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ సికందర్ నాయక్, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ వెంకన్న, డాక్టర్ శిఖర, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ శ్రావ్య, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీశైలం, డాక్టర్ శ్రీకాంత్, డీపీవో విశాల, డీహెచ్‌ఈ ఘనపూర్ వెంకటేశ్వర్లు, డీడీఎం నారాయణ, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article