ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహణ ప్రజల భద్రత
. . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహణ ప్రజల బాధ్యత అని శాంతి భద్రతల పరిరక్షణ పోలీసులు బాధ్యత అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచనలు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రశాంత వాతావరణంలో, నిర్వహణ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఎన్నికల భద్రత , శాంతి భద్రతా చర్యలు , పర్యవేక్షణకు సంబంధించిన సూచనలు , సలహాలు అధికారులు తెలియజేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది అప్రమత్తతతో విధులు నిర్వహించాలని కోరారు. ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని , ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికి అక్రమంగా డబ్బు , మద్యం లేదా ఇతర పదార్థాలు రాకుండా చెక్‌పోస్టుల వద్ద ఇతర శాఖల సమన్వయంతో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్ , నాకాబందీ , ఆకస్మిక తనిఖీలు నిరంతరం జరగాలి తెలిపారు. ఎస్.హెచ్.ఓలు , వీ.పీ.వో(విలేజ్ పోలీస్ ఆఫీసర్) లు ప్రతి గ్రామాన్ని సందర్శించి పోలింగ్ కేంద్రాలను పరిశీలించడంతో పాటు గ్రామాల్లో పెట్రోలింగ్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాలని అన్నారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, ఇతరుల భావోద్వేగాలను దెబ్బతీసే విధంగా చర్యలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పేర్కొన్నారు. ప్రతి సిబ్బంది ముందస్తు సమాచారం సేకరించాలని, అట్టి సమాచారం ఎప్పటికప్పుడు తమ పై అధికారులకు తెలియజేయాలని అన్నారు. ఎన్నికలకు సంబంధించిన అంశాల్లో, రాజకీయ కార్యకలాపాల్లో పోలీస్ సిబ్బంది ఎలాంటి ప్రమేయం ఉండకూడదని హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘన చోటుచేసుకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో వివాదాస్పద కేసులో, అలాగే ఇతర కేసులు నమోదైన రౌడీ షీటర్లను బైండోవర్ చేసి వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద పకడ్బందీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీస్ కమిషనర్ తో పాటు అదనపు డి.సి.పి (అడ్మిన్) బస్వా రెడ్డి , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, డీ.సీ.ఆర్‌బీ ఇన్స్పెక్టర్ రమేష్ , అంజయ్య, ఎలక్షన్స్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీ వీరయ్య , కమ్యూనికేషన్ సిబ్బంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
