భూపాలపల్లి, బతుకమ్మ : కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై కేసు వేసిన నాగవెల్లి రాజలింగ మూర్తి హత్యకు గురయ్యాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ హత్యకు గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, మేడి గడ్డ బ్యారేజీ 7వ బ్లాకులో పిల్లర్ కుంగిపోయిందని నాగవల్లి రాజలింగ మూర్తి భూపాలపల్లి కోర్టులో కేసు వేశారు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంతి కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఇంజనీరింగ్ అధికారులతో పాటు పలువురిని బాధ్యులను చేయాలని తన పిటిషన్ లో లింగమూర్తి పేర్కొన్నాడు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు పలువురికి నోటీసులు కూడా జారీ చేసింది. విచారణపై స్టే ఇవ్వాలని కోరుతూ కేసీఆర్, హరీష్ రావు హైకోర్టును అభ్యర్థించారు. ఈ స్టే పొడిగించే విషయంపై గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణకు ముందు రోజే పిటిషనర్ హత్యకు గురికావడం గమనార్హం. అయితే రాజలింగ మూర్తిని పక్కా ప్లాన్ వేసి చంపినట్టులగా స్పష్టం అవుతోంది. ఆయన ఏఏ ప్రాంతాల్లో సంచరిస్తాడు.. ఎక్కడ అతన్ని మట్టుబెట్టవచ్చు అనే విషయంపై పూర్తి స్థాయిలో అవగాహనకు వచ్చిన తరువాత రెడ్డి కాలనీని ఎంచుకున్నట్లు అనుమానిస్తున్నారు. లింగమూర్తిని ఫాలో అయి ఎవరూ లేని చోటు ఎంచుకుని చంపారా..? లేక కాపు కాసి చంపారా అన్న విషయం స్పష్టత రావాల్సి ఉంది. పోలీసు అధికారులు అనుమానితులను గుర్తించ పనిలో నిమగ్నమయ్యారు. సాంకేతికత ఆధారంగా, సీసీ పుటేజీ ద్వారా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
