. . . సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసి జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
దేశంలో తీవ్రమైన సంక్షోభ పరిస్థితులు, నిరుద్యోగం, ఉపాధి కోల్పోయే పరిస్థితులు రాకముందే యుద్ధం ఆపి, ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి ఈ నెల 30 న ఉదయం 10 గంటలకు నగరంలోని నెహ్రూ పార్క్ నుండి పాత కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామని, యుద్ధం వ్యతిరేకించే వాళ్ళు, శాంతిని కోరుకునే అన్ని పక్షాల ప్రజలు వచ్చి ర్యాలీ ని విజయవంతం చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసి జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరం లోని కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్ లో శుక్రవారం యుద్ధ వ్యతిరేక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం వలన ఇప్పటికే ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. చిన్న చిన్న దేశాల్లో కరోనా లాక్ డౌన్ పరిస్థితులు వచ్చాయని, ఇటు మన ఇండియా లో కూడా ప్రజలు పెట్రోల్, డీజిల్, ముఖ్యంగా వంట గ్యాస్ కొరత ఏర్పడి ప్రజలు పెట్రోల్ బంకుల్లో, గ్యాస్ ఏజెన్సీ ల ముందు బారులు తీరుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిలువలు ఉన్నాయని చెబుతున్నప్పటికి, సరఫరా చేయడంలో, మానిటరింగ్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయిందన్నారు. యుద్ధం ఇంకా కొనసాగుతుందనీ ఈ పరిస్థితుల్లో ఇంకా ముందుకు పోతే ఇండియా కూడా లాక్ డౌన్ చేసుకునే పరిస్థితులు రాబోతున్నాయని మొన్న దేశ ప్రధాని పార్లమెంట్ లో మాట్లాడుతూ సంక్షోభ పరిస్థితులు దేశ ప్రజలు ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని బహిరంగంగానే ప్రకటించారని గుర్తు చేశారు. ఈ సమన్వయ కమిటీ సమావేశంలో వామపక్ష పార్టీల నాయకులు రమేష్ బాబు, సుధాకర్, వనమాల కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు శరత్, తెలంగాణ జాగృతి నాయకులు ఏనుగందుల మురళి, వేల్పూర్ భూమయ్య, పరుచూరి శ్రీధర్, ఓమయ్య, మామిడాల వెంకటి, కటారి రాములు, జమాతే ఇస్లామిక్ నాయకులు ఉస్సెన్, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
