. . . కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన ఆర్ఎస్ పి నాయకులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:
ఆన్‌లైన్ ( యాప్) యూరియా పంపిణీ విధానాన్ని రద్దు చేసి, పాత పద్ధతిలోనే రైతులకు యూరియా ఎరువులు అందుబాటులో ఉంచాలని రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ డిమాండ్ చేసింది. అర్ ఎస్ పి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ యూరియా పంపిణీ విధానాన్ని రద్దు చేసి, పాత పద్ధతిలోనే రైతులకు యూరియా ఎరువులను అందుబాటులో ఉంచాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా RSP జిల్లా కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ, ప్రస్తుతం అమలులో ఉన్న ఆన్‌లైన్ యూరియా యాప్ విధానం రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని అన్నారు. యాప్‌లో యూరియా స్టాక్ కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే కనిపించి, వెంటనే “నో స్టాక్” అని చూపించడం వల్ల రైతులు ఎరువులు పొందలేకపోతున్నారని పేర్కొన్నారు.దీంతో రైతులు ప్రైవేట్ దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, రైతులు అధిక ధరలకు యూరియా కొనుగోలు చేసి ఆర్థికంగా నష్టపోతుండగా దళారులు మాత్రం లాభపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ సీజన్ సమయంలో యూరియా కొరత ఏర్పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, రైతులకు సులభంగా అందే విధంగా పాత పద్ధతిలో ఎరువుల పంపిణీ కొనసాగించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎఐఎస్ కేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యార్లగడ్డ సాయిబాబా, ఆర్ ఎస్ పి జిల్లా నాయకులు పిట్ల.నరేష్, తూర్పాటి కృష్ణ, బాల ముకుందం తదితరులు ఉన్నారు.

