రుద్రూర్, బతుకమ్మ : సీపిఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టిపియుఎస్) ఆధ్వర్యంలో శనివారం తహసీల్దార్ తారాబాయికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన కోరికలన్నీ నెరవేరుతాయని ఎన్నో కలలుగన్నామన్నారు. కానీ కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆశలను అడియాశలు చేస్తూ ఆగస్ట్ 23, 2014 రోజున ఒక చీకటి జీవో నం. 28 ను తీసుకొని రావడం జరిగిందని, ఈ జీవో ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విధంగానే 01.09. 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన ఉద్యోగ ఉపాధ్యాయులు అందరికీ సిపిఎస్ (కొత్త పెన్షన్) ను వర్తింపజేయాలని నిర్ణయం తీసుకోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. 2023 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల సమయంలో తమరు మేనిఫెస్టో ద్వారా అధికారంలోకి వచ్చిన 100 రోజులలోపు సిపిఎస్ ను రద్దు చేస్తామని తెలియజేశారు. కావున ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన ఉన్న మీరు సిపిఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ విధానమును పునరుద్దరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కర్నె శంకర్, పద్మావతి, భవాని, వనిత, సంతోషిని, గంగారం, భగత్, శివకుమార్, గంగా శంకర్, రామా గౌడ్, జయరాం, హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.
