24.7 C
Hyderabad
Monday, August 3, 2026

జాతీయ లోక్ అదాలత్ అంటేనే . . . నిత్య కళ్యాణం పచ్చతోరణం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రాష్ట్రస్థాయి సన్నాహక సమావేశంలో అన్ని ప్రభుత్వ శాఖల మద్దతు

 

. . . మోటారు రోడ్డు ప్రమాద నష్ట పరిహార దావాలలో గృహిణులకు నెలకు 30 వేలకు ఫిక్స్

 

. . . జాతీయ లోక్ అదాలత్ విజయానికి వినతి

 

. . . న్యాయవాదుల సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ  :

 

తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు నిత్య కళ్యాణం నిర్వహిస్తు పచ్చ తోరణం లాగా ఉంచినట్లు న్యాయవ్యవస్థలో కూడా ప్రజా కళ్యాణం కోసం మూడు నెలలకోమారు జాతీయ లోక్ అదాలత్ అనే మహాకార్యం నిర్వహిస్తామని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జీవిఎన్ భారత లక్ష్మీ తెలిపారు. జూన్ 20 న జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా కోర్టు సముదాయంలోని బార్ సమావేశపు హల్ నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలకంఠ రావు అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ఆమె తన సహచర అదనపు జిల్లా జడ్జిలు హరీష, సుగాలి నారాయణ, దుర్గా ప్రసాద్, వరూధిని లతో కలిసి న్యాయవాదులనుద్దేశించి ప్రసంగించారు. స్వామివారి నిత్య కళ్యాణం మానవాళి శ్రేయస్సు కోసం, అనుగ్రహం కోసం నిర్వహించినట్లు జాతీయ లోక్ అదాలత్ కూడా మానవ కళ్యాణం కోసమేనని ఆమె వివరించారు. మానవ కళ్యాణమంటే మానవ శ్రేయస్సు కోరే శుభ కార్యాక్రమమే జాతీయ లోక్ అదాలత్ అని ఆమె అభివర్ణించారు. మామిడికాయలు కాయలుగా ఉన్నప్పుడు తెంపి పక్వానికి ఉంచి పండుగా మలిచినట్లు న్యాయస్తానంలోని న్యాయ వివాదాలను విచారణ దశలో ఉండగానే ముందస్తుగా లోక్ అదాలత్ లలో రాజీ పద్ధతిన పరిష్కరించుకోవడం వలన ఆ తీయదనపు తీపి గుర్తులు చిరకాలం గుర్తు ఉండి పోతాయని న్యాయవాదుల హర్షద్వనాల మధ్య తెలిపారు. తెలంగాణ రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సామ్ కోషి ఆధ్వర్యంలో ఈ మధ్య నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి వి ఆనంద్, డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యూషన్ సాంబశివ రెడ్డి, ఇతర ప్రభుత్వ శాఖల ఆధిపతులు పాల్గొని తమతమ శాఖల తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారని ఆమె వివరించారు. ముఖ్యంగా పోలీస్ శాఖ తరపున రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పెద్ద ఎత్తున జాతీయ లోక్ అదాలత్ వైపు మలుపుతామని డిజిపి ఆనంద్ తెలిపినట్లు ఆమె తెలిపారు. న్యాయసేవ సంస్థకు న్యాయవాదుల వెన్నుదన్ను లేనిదే కాలు కదిలించలేమని జిల్లాజడ్జి భారత లక్ష్మీ తెలుపుతూ జాతీయ లోక్ అదాలత్ ను ముందుండి నడిపించాల్సిందేనని కోరారు. న్యాయవాదుల సాధకభాధలు తెలుసని, న్యాయవాదుల ప్రమేయం లేకుండా న్యాయ వివాదాలను పరిష్కరించలేమని పేర్కొన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు మోటారు రోడ్డు ప్రమాద నష్ట పరిహార దావాలో తీర్పు చెబుతూ గృహిణులు దేశ నిర్మాతలని ప్రస్తావిస్తు రోడ్డు ప్రమాదంలో మరణించిన మహిళకు నెలకు ముప్పై వేల రూపాయల చొప్పున లెక్కగట్టి చెల్లించాల్సిందేనని పేర్కొన్న విషయాన్ని తెలిపారు. జిల్లా కోర్టులలో ఉన్న దావాలలో సుప్రీంకోర్టు తీర్పునే అనుసరిస్తామని అన్నారు. ముందుగా మాట్లాడినట్టు అందరి అభిమతం భగవత్ కల్యాణమైన జన కల్యాణమైన లోక కళ్యాణమే కదా జాతీయ లోక్ అదాలత్ లక్ష్యం అంటు అందుకు న్యాయమూర్థులుగా, న్యాయవాదులుగా, కక్షిదారులుగా కలిసి నడుద్దామని అన్నారు. అదనపు జిల్లాజడ్జి హరీష మాట్లాడుతూ జూన్ 20 న నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ లో ఓల్డ్ ఐపీసి లోని సెక్షన్ 338 మోటారు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కేసులలో ముద్దాయిలు నేరం చేశామని ఒప్పుకుంటే కేసులో జరిమానాతో ముగించిండానికి అవకాశం ఉన్నదని తెలిపారు. బార్ అధ్యక్షుడు నీలకంఠ రావు మాట్లాడుతూ జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ నాల్సా తో కలిసి నడవడమే న్యాయవాదులుగా నేర్చుకున్న పాఠమని జాతీయ లోక్ అదాలత్ వైపు నడకను కొనసాగిస్తామని తెలిపారు. సీనియర్ న్యాయవాదులు రఘువీర్ భూపాల్, చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ మోటారు రోడ్డు ప్రమాద నష్ట పరిహార దావాలలో, భూ నష్ట పరిహార దావాలలో బీమా కంపెనీల నుండి, ప్రభుత్వ యంత్రాంగం నుండి ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. సమావేశంలో జూనియర్ సివిల్ జడ్జిలు చైతన్య అంగరి, వడ్డి హరి కుమార్, పాముజుల శ్రీనివాస్ రావు, కీర్తి రాజ్, బార్ ప్రధాన కార్యదర్శి నల్ల సుభాష్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఆవుల నారాయణ రావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ నరసింహ రెడ్డి, దయాకర్ గౌడ్, సీనియర్ న్యాయవాదులు కృపాకర్ రెడ్డి, జక్కుల వెంకటేశ్వర్, భాస్కర్, పరుచూరి శ్రీధర్, మధుసుధన్ రావు, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేధార్ తదితరులు పాల్గొన్నారు.

 

The National Lok Adalat is synonymous with perpetual festivity and prosperity.

More articles

Latest article