- తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మోటార్ వాహన చట్టం -2019ని సవరించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని – తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్టీవో కార్యాలయంలో ఇన్చార్జి డిటిఓ రాహుల్ కుమార్ కు మంగళవారం సమ్మె నోటిస్ అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు మాట్లాడుతూ కేంద్రలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ, మొత్తం రవాణా రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసేందుకు పూనుకుంటున్నదని తెలిపారు. కార్మికవర్గం రక్తం చిందించి 100 సంవత్సరాల క్రితం నుండి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసే, వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ను తీసుకొచ్చిందన్నారు. ఇప్పుడు వాటిని అమలు చేసి కార్మికుల హక్కులను హరించి, కార్మికుల్ని బానిసలుగా చేసేందుకు బిజెపి ప్రభుత్వం పూనుకుంటుందని పేర్కొన్నారు. అందుకే కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు వెనక్కి కొట్టి, మన సమస్యల పరిష్కారానికై, రవాణా రంగాన్ని రక్షించడానికి, ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 2025 జూలై 9 న దేశవ్యాప్త సమ్మెకు కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, రోడ్డు రవాణా కార్మిక సంఘాల అఖిల భారత సమన్వయ కమిటీ పిలుపునిచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ అబ్దుల్ ముజీబ్ ఇమ్రాన్ ఖాన్ కిషన్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

