. . . ఎల్లారెడ్డి ఆర్ డిఓ ప్రభాకర్
ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి శాఖ అధికారి బాధ్యతగా స్పందించాలని ఎల్లారెడ్డి ఆర్ డిఓ ప్రభాకర్ అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మొత్తం 10 దరఖాస్తులు అందినట్లు ఆయన తెలిపారు. రెవెన్యూ శాఖకు సంబంధించినవి 4, మున్సిపల్ శాఖకు సంబంధించినవి 3, విద్యుత్ శాఖ ఎంపీడీసీఎల్ కు సంబంధించినది 1, పంచాయతీ రాజ్ (ఎంపీడీఓ) శాఖకు సంబంధించినవి 2 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా ఒక వృద్ధ మహిళ ప్రజావాణికి హాజరై తన సమస్యను వివరించగా, ఆర్‌డీఓ స్వయంగా బయటకు వచ్చి ఆమె వినతిని స్వీకరించడం విశేషం. వెంటనే సంబంధిత అధికారిని పిలిపించి, సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ ఘటన కార్యక్రమానికి హాజరైన వారిలో మంచి స్పందన పొందింది.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ షాకీర్ అహ్మద్, మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల అధికారి సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి వినతిని సమగ్రంగా పరిశీలించి, సంబంధిత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

