- అక్రమంగా ఇసుక డంపులు..
రుద్రూర్, బతుకమ్మ: రోజు రోజుకు ఇసుక మాఫియా పెట్రేగి పోతుంది. పోతంగల్ లోని మంజీరా నది నుండి పెద్ద మొత్తంలో ఇసుకను తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఠాగా ఏర్పడిన కొంతమంది ఇసుక దందా చేసేవాళ్లు రుద్రూర్ మండల కేంద్రంలోని సులేమాన్ నగర్ గ్రామ శివారు ప్రాంతాల్లోని షాదీఖాన వద్ద భారీ మొత్తంలో ఇసుక డంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ మొత్తంలో ఇసుకను డంపులు చేస్తూ అర్థ రాత్రి వేళల్లో బొప్పాపుర్, చందూర్, మోస్రా మీదుగా నిజామాబాద్ వైపుకు ఇసుకను టిప్పర్లలో తరలిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పర్మిషన్లు తీసుకున్న కొందరు ఇసుకాసురులు దాన్ని పక్క దారి మల్లించి సొమ్ము చేసుకుంటున్నారు. పొతంగల్ నుండి నిజామాబాద్ మార్కెట్, అపార్ట్ మెంట్లకు తరలిస్తూ పెద్ద మొత్తంలో జేబులు నింపుకుంటున్నారు. వర్షాకాలం కావడంతో రాష్ట్రంలో ఇసుక ధరలకు రెక్కలు రాగ దాన్ని అదునుగా తీసుకుంటున్న కొందరు ఇసుకాసురులు ఒక్కో టిప్పర్ కు రూ.35 నుండి రూ.50 వేల వరకు దండుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక మాఫియా పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

