ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
బతుకమ్మ, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని జీవధాన్ పాఠశాలలో జరిగిన ఘటన చాలా బాధాకరమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. కామారెడ్డి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మహమ్మద్ అలీ షబ్బీర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జీవధాన్ పాఠశాలలో ఆరేళ్ళ చిన్నారి పై లైంగిక దాడి కేసు విషయం లోతైన విచారణ చేపట్టి దోషిగా తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మీడియా ద్వారా తనకు విషయం తెలిసి బాధపడ్డానన్నారు. ఈ విషయమై జిల్లా ఇంఛార్జి మంత్రి కూడా ఆరా తీశారని తెలిపారు. కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో అమ్మాయి చనిపోయిందని దుష్ప్రచారం చేశారని, దీంతో పాఠశాలలో జరిగిన ఆందోళనలో కొందరు అల్లరి మూకలు పోలీసుల పై రాళ్లదాడికి పాల్పడ్డారని,ఈ దాడిలో సీఐ చంద్రశేఖర్ రెడ్డి తలకు గాయం కాగా ఎస్సై రాజారాం,తీవ్ర అస్వస్థతకు గురి కాగా, హెడ్ కానిస్టేబుల్ హజారుద్దీన్ కు కాలు విరిగిందన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై మరియు సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ,ఐజీలను కోరారు.అమాయక యువకుల పై విద్యార్థుల కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేయొద్దని,అలా చేస్తే భవిష్యత్తులో వారికి ఉద్యోగాల విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. పాఠశాలలో ఆందోళన నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం సూచన మేరకు పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చిన తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారన్నారు. కామారెడ్డి శాంతియుతంగా ఉందని, ఇది కమ్యూనల్ ఇష్యు కాదన్నారు. కామారెడ్డి భవిష్యత్తుకు కుల మతాలకు అతీతంగా అందరూ సహకరించాలన్నారు.
జీవధాన్ పాఠశాలలో జరిగిన ఘటన చాలా బాధాకరం
