24.7 C
Hyderabad
Monday, August 3, 2026

మహిళా సాధికారత సాధనే ప్రభుత్వ లక్ష్యం

Must read

📰 Generate e-Paper Clip

  • నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి
  • రూరల్ సెగ్మెంట్ లో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబురాలు
  • కలెక్టర్ తో కలిసి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ

 

నిజామాబాద్, బతుకమ్మ : మహిళా సాధికారత సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం విస్తృత కార్యక్రమాలను అమలు చేస్తోందని నిజామాబాద్ రూరల్ శాసన సభ్యులు డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తోందని గుర్తు చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలో ఇందిరా మహిళా శక్తి సంబురాలను సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. బోర్గం(పి) శివారులోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేశారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డితో కలిసి మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, లోన్ బీమా, బాధిత కుటుంబాలకు ప్రమాద బీమా పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆర్ధిక తోడ్పాటుతో వ్యాపార లావాదేవీల నిర్వహణ ద్వారా  సాధించిన ఆర్ధిక ప్రగతి గురించి ఆయా సంఘాల మహిళా సభ్యులు వివరిస్తూ, తోటి సభ్యులలో స్పూర్తిని పెంపొందించారు.

ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ, మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ చేపట్టిన వెనువెంటనే ఉచిత ప్రయాణాన్ని అమలులోకి తెచ్చిందని గుర్తు చేశారు. మహిళల ఉచిత ప్రయాణ చార్జీలను ప్రభుత్వమే భరిస్తోందని, 18 నెలల కాలంలోనే ఆర్టీసీకి రూ. 6500 కోట్లు చెల్లించిందని అన్నారు. మహిళా సాధికారతను కేవలం నినాదానికే పరిమితం చేయకుండా ఆచరణలో అమలు చేసి చూపుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే మహిళలను లబ్దిదారులుగా ఎంపిక చేస్తూ ఇందిరమ్మ ఇళ్ళను వారి పేరిట మంజూరు చేస్తున్నామని గుర్తు చేశారు. ఇళ్ళ నిర్మాణాలు చేపట్టేలా లబ్దిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నామని అన్నారు. స్వశక్తితో మహిళలు సాధికారత దిశగా పయనించేలా సోలార్ పవర్ ప్లాంట్ లు, ఆర్టీసీ అద్దె బస్సులు, పెట్రోల్ బంక్ లు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లు, మహిళా శక్తి బజార్లు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో బడులలో మౌలిక సదుపాయాల కల్పన పనులు, స్కూల్ యూనిఫామ్ ల స్టిచింగ్, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ వంటి అనేక అంశాలలో మహిళా సంఘాలకు అవకాశం కల్పిస్తూ వారి ఆర్థిక పురోగతికి బాటలు వేస్తోందని అన్నారు. ఏటా రూ. 25 వేల కోట్ల చొప్పున నాలుగేళ్లలో మహిళల సంక్షేమ, అభివృద్ధికి ప్రభుత్వం రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తుందని అన్నారు. కేవలం ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా రాజకీయ రంగంలో కూడా సరైన ప్రాతినిధ్యం కల్పించేలా చట్టసభలలో 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని మహిళా సంఘాలకు సూచించారు.

కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రభుత్వం బ్యాంకు లింకేజీ, వడ్డీ లేని రుణాలను పెద్ద మొత్తంలో పంపిణీ చేస్తోందని అన్నారు. జిల్లాలోని 20,547 మహిళా సంఘాలకు రూ. 21.69 కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం మంజూరు చేసిందని వివరించారు. ఇందులో భాగంగానే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని 5781 మహిళా సంఘాలకు రూ. 5.91 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ప్రమాద బీమా, బీమా లోన్, బ్యాంకు లింకేజీ రుణాలను ప్రభుత్వం మంజూరు చేసిందని కలెక్టర్ వివరించారు. ప్రమాద బీమా అమలు వల్ల బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల బీమా పరిహారం వర్తించడంతో పాటు మహిళా సంఘం యధావిధిగా కొనసాగేందుకు బీమా దోహదపడుతుందని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో మహిళల అభ్యున్నతి కోసం విస్తృత స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ వేడుకలలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, డీఆర్డీఓ సాయాగౌడ్, సొసైటీల చైర్మన్లు, జిల్లా, మండల మహిళా సమాఖ్యల ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

The government's goal is to achieve women's empowerment.

More articles

Latest article