24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో సమస్యలు పరిష్కారమయ్యే వరకు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయులకు అండగా నిలుస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి స్పష్టం చేశారు. విద్యారంగంలో నెలకొన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని నిరసిస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయుఎస్) ఆధ్వర్యంలో హైదరాబాద్ ధర్నా చౌక్‌లో నిర్వహించిన ధర్నాకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నం పెట్టే రైతులు వర్షాభావం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, విద్యను అందించే ఉపాధ్యాయులు కూడా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 51 శాతం పీఆర్సీ బకాయిలు, ఆరు డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంటూ, దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో ఇలాంటి పరిస్థితి నెలకొనడం విచారకరమన్నారు. ఈ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి, ప్రస్తుతం విద్యాశాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నప్పటికీ ఉపాధ్యాయుల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మూసీ నది ప్రక్షాళన కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ప్రభుత్వం చూపుతున్న ఆసక్తి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎందుకు కనిపించడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో సుమారు రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌ మెంట్, రూ.4 వేల కోట్ల స్కాలర్‌షిప్‌లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంటూ, ఈ పరిస్థితి రాష్ట్ర విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ఉపాధ్యాయులతో విభేదించిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని పేర్కొన్న ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏ బకాయిలను అమలు చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నాయకత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ ధర్నా కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీసీయుఎస్) నాయకులు కిషన్ రెడ్డి, మధుసూదన్ చారి, వరప్రసాద్, బద్రీనాథ్, కృష్ణవేణి, కవిత తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article