బాల్కొండ, బతుకమ్మ: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 17 నెలలవుతున్నా ఇప్పటి వరకు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం(సీడీపీ) నిధులను ఇవ్వలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఓ వైపు ప్రజలు స్థానికంగా అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతున్నారని, మరోవైపు ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్ రెడ్డి, జోగినపల్లి సంతోష్ కోటా నిధులతో నియోజకవర్గంలోని కమ్మర్ పల్లి మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రశాంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. కొనసముందర్ లో రూ.10లక్షలతో నిర్మించిన పీఏసీఎస్ గోదాం, అమీర్ నగర్ డీసీ తండాలో రూ.20లక్షలతో రూ.20లక్షలతో నిర్మించిన ఎస్టీ కమ్యూనిటీ హాల్, అమీర్ నగర్ లో రూ.6లక్షలతో చేపట్టిన పీఏసీఎస్ గోదాములను ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం సీడీపీ నిధులు ఒక్క రూపాయి ఇవ్వకున్నా.. తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, కేఆర్ సురేశ్ రెడ్డి రైతుల కోసం నిధులు కేటాయించారన్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా తాము చేతనైంత చేస్తున్నామని, తమ పార్టీ రాజ్యసభ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.
