. . . తరుగు పేరుతో 40 కిలోలకు 5 కిలోల వడ్లు దోపిడి
. . . రేపు మోర్తాడ్ లో ధర్నా
వేల్పూర్ /నిజామాబాద్, బతుకమ్మ :
కాంగ్రెస్ ప్రభుత్వం రైస్ మిల్లర్ల చేతిలో కీలు బొమ్మగా మారిందని, రైస్ మిల్లర్లు చెప్పిందే వేద వాక్కుగా మారిందని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గత మూడు రోజులుగా నియోజకవర్గంలోని పలు కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శించిన ఆయన ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి రేపు మోర్తాడ్ లో రైతు నిరసన కార్యక్రమం చేపడుతున్నామని వేల్పూర్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లాలో, ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో వడ్ల కొనుగోళ్లు అత్యంత నత్తనడకన సాగుతున్నాయని, రైతులు పంటను అమ్ముకోవడానికి గత నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నారని దీనికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేస్తామని ప్రకటించి, సెంటర్లు తెరిచేసరికి 15 రోజులు, గన్నీ బ్యాగులు వచ్చేసరికి వారం, కాంటా పెట్టేసరికి మరో వారం అన్నట్లుగా 20 రోజుల పాటు కావాలనే జాప్యం చేసిందని విమర్శించారు. మద్దతు ధర రూ.2390 ఉండగా, ప్రభుత్వ జాప్యం భరించలేక రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వ్యక్తులకు రూ.1750 నుండి 1900 లకే అమ్ముకుంటున్నారని, దీనివల్ల ఎకరాకు సుమారు రూ.15,000 నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, తరుగు పేరుతో 40 కిలోలకు 5 కిలోల అదనపు వడ్లు (క్వింటాల్‌కు 12.5 కిలోలు) దోచుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఇది కేవలం 1.5 కిలోలు మాత్రమే ఉండేదని గుర్తు చేశారు. రైతుల సమస్యలపై మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేస్తే, ఫోన్ ఎత్తడం లేదని, కనీసం స్పందించే తీరిక కూడా లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ పాలిసీ లో భాగమేనా అని ఆయన దుయ్యబట్టారు. వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని, వడ్ల రవాణాకు లారీలను పెంచాలని, గన్నీ బ్యాగుల కొరత తీర్చాలని, తరుగును తగ్గించి, పాత పద్ధతిలోనే వడ్లు సేకరించాలని, దొడ్డు రకానికి గ్రేడ్-1 రేటుతో పాటు రూ.500 బోనస్ వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేసారు. రైతుల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి రైతులకు న్యాయం చేసే వరకు విశ్రమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రేపు (సోమవారం) ఉదయం 10 గంటలకు మోర్తాడ్‌లో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ నిరసనను విజయవంతం చేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

