. . . రాష్ట్రప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
సాంకేతిక నైపుణ్యం లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ టెక్నాలజీ లదే భవిష్యత్తు అని దానిపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం నిజామాబాద్‌లోని ఐటీ హబ్‌లో ఇంజినీరింగ్, పాలిటెక్నికల్, అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ల ప్రిన్సిపాల్స్ తో విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యం మరింత అందించే విషయమై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఆయా కళాశాలల విద్యార్థులకు టెక్నోసాపియన్సిట్ సొల్యూషన్స్ సాంకేతిక సంస్థ ద్వారా నైపుణ్యాభివృద్ధి కోసం శిక్షణ ఇచ్చేందుకు గాను సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ కోర్సులు పూర్తి చేసే దశలో విద్యార్థులకు మారుతున్న కాలానికి అనుగుణంగా మరింతగా సాంకేతిక నైపుణ్యం అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణ ద్వారా కోర్సు పూర్తి కాగానే విద్యార్థులు మంచి ఉద్యోగాలు సంపాదించవచ్చన్నారు. ఉద్యోగాలే కాకుండా స్థానికంగానూ కంపెనీలు ఏర్పాటు చేయవచ్చన్నారు. తద్వారా లోకల్ టాలెంట్‌ను ప్రోత్సహించి ఉద్యోగావకాశాలు సృష్టించవచ్చన్నారు. కోర్సులు పూర్తిచేశాక మరింత నైపుణ్యం కోసం ఇతర నగరాలకు వెళ్లకుండా ఇక్కడే శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నామన్నారు. కళాశాలలు ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలన్నారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆలోచనలు పంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు.
బిఆర్ఎస్ హయంలో చేసిన పాపాలను పోగొట్టి అభివృద్ధి దిశగా..
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో చేసిన పాపాలను పోగొట్టడంతో పాటు అభివృద్ధి దిశగా ముందుకెళుతున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో పాఠశాలల్లో బాలికలకు బాత్రూంలు సైతం లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డారని సుదర్శన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిధులు కేటాయించి సౌకర్యాలు మెరుగుపరచడంతో విద్యలో ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు. అడ్మిషన్లు పెరిగాయన్నారు. చదువులో నాణ్యత, పనిలో నైపుణ్యం ఉంటేనే తగిన ఫలితాలు ఉంటాయన్నారు. లేకుంటే ఎన్ని కోర్సులు చేసినా ఉపయోగం ఉండదన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ కమిషన్‌సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, ఉర్థూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, నరాల రత్నాకర్, రామర్తి గోపి, పారుపల్లి గంగారెడ్డి, వేణురాజ్ తదితరులు పాల్గొన్నారు..
