- అనుమతులు లేకుండా మొరం త్రవ్వకాలు
- ట్రాక్టర్లలో మొరం అక్రమ రవాణా
చందూర్, బతుకమ్మ: కొందరు అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం దందా కొనసాగిస్తూ గుట్టలను మాయం చేస్తున్నారు. వీరి ధన దాహానికి గుట్టలు మాయమై మైదానాలుగా మారుతున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో మొరం దందాను మూడు పువ్వులు, ఆరు కాయలుగా మార్చుకుంటున్నారు. చందూర్ మండలంలోని ఘన్ పూర్ గ్రామ శివారులో గల గుట్ట ప్రాంతంలో కొందరు అక్రమార్కులు శనివారం రోజున ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం త్రవ్వకాలు చేపడుతున్నారు. మొరం త్రవ్వకాల కొరకు మైనింగ్, రెవిన్యూ అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి అనుమతులు లేకుండా మొరం త్రవ్వకాలు చేపడుతూ ట్రాకర్లలో అక్రమంగా మొరం తరలిస్తు సొమ్ము జేబులో నింపుకుంటున్నారు. స్థానిక ప్రజలు ఎవరైన నిలదీస్తే అభివృద్ధి పనుల కోసం అనుమతులు తీసుకొని తవ్వకాలు చేపడుతున్నామంటూ గుట్టలను మింగేస్తున్నారు. మొరం త్రవ్వకాల పై సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకుండా మామూళ్ళ మత్తులో మునిగి తెలుతున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మొరం త్రవ్వకాలు చేపడుతున్న వారి పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
