నిజామాబాద్, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధాన రాజకీయపార్టీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ఎన్నికల్లో పాల్గొంటుండడంతో గెలుపు ఎవరిదనేదానిపై ఉత్కంఠ నెలకొంది. రెండు టీచర్స్ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి గురువారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే అందరి దృష్టి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రల స్థానంపై నెలకొంది. బిజేపి తరపును అంజిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నరేంధర్ రెడ్డి, బీఎస్పీ మద్దతుతో ప్రసన్న హరిక్రిష్ణ, స్వతంత్ర అభ్యర్థిగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ మద్దతుతో పోటీలో ఉన్న యాదగిరి శేఖర్ రావు వివిధ పార్టీల అభ్యర్థులతో సమానంగా పోటీపడ్డారు. అధికార కాంగ్రెస్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదే సమయంలో బీజేపీ సైతం గెలుపే లక్ష్యంగా పనిచేసింది. ఆ పార్టీకి చెందిన నలుగు ఎంపీలు బీజేపీ అభ్యర్థి కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ తరఫున ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. విద్యావంతులైన పట్టభద్రులు ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్న నేపథ్యంలో గెలుపు ఎవరిదనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. రాజకీయ పార్టీల తరఫున అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ఓటర్లు తమకు ఇష్టమైన అభ్యర్థికి ఓటు వేసుకునే అవకాశం ఉంటుంది.

. . . ఒక చోట కాంగ్రెస్, మూడు చోట్ల బీజేపీ
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండుచోట్ల బీజేపీ అభ్యర్థులు పోటీచేస్తుండగా.. కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రమే పోటీచేస్తోంది. ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి పోటీలో ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టలేదు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయసంఘాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ ప్రాధాన్యతకంటే యూనియన్ల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ రెండుచోట్ల ఎవరు గెలుస్తారనే విషయానికి అంతగా ప్రాధాన్యత లేకుండా పోయింది. ఉపాధ్యాయసంఘాల నేతల్లో చీలిక రావడంతో ఎవరు ఎవరికి మద్దతు ఇస్తున్నారనే విషయంలో స్పష్టత లేకుండా పోయింది. ఇక ఎక్కువమంది ఓటర్లు ఉన్న పట్టభద్రుల స్థానంలో మాత్రం చతుర్ముఖ పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి మధ్య నువ్వా-నేనా అన్నట్లు పోటీ ఉందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ.. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కూడా వారిద్దరికి గట్టి పోటీనే ఇచ్చారనే ప్రచారం జరిగింది. ఇక చాపకింద నీరులా యాదగిరి శేఖర్ రావుకు సైలేంట్ ఫోలింగ్ లో ఓట్లు పడ్డాయని సమాచారం.

. . . చతుర్ముఖ పోటినేనా?
కరీంనగర్ పట్ట భధ్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీకి పోటీలో 56 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ.. నలుగురు అభ్యర్థుల మధ్య ప్రధానపోటీ నెలకొంది. ఈ నలుగురు అభ్యర్థుల్లో ముగ్గురు విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులు కాగా.. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి ప్రత్యక్షంగా విద్యారంగంతో సంబంధం లేదు. పోటీపరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం స్టడీ మెటిరీయల్ తయారీలో నైపుణ్యం ఉన్న ప్రసన్న హరికృష్ణకు గ్రాడ్యుయేట్లను నమ్మి బరిలో నిలిచారు.అదే సమయంలో పార్టీల బలం అంజిరెడ్డి, నరేందర్ రెడ్డికి ప్లస్‌గా భావిస్తున్నారు.

ప్రయివేట్ స్కూల్ అసోసియేషన్ మద్దతుతో పోటీలో ఉన్న శేఖర్ రావు సైతం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. దీంతో గెలుపుపై నలుగురు అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు.కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానం నుంచి ఎవరు గెలిచినా మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచే అవకాశం లేదనేది సుస్పష్టం. నలుగురు అభ్యర్థుల మధ్య ప్రధానపోటీ నెలకొని ఉండటంతో మూడు లేదా నాలుగో ప్రాధాన్యత ఓటుతో మాత్రమే ఫలితం తేలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రధాన పార్టీల అభ్యర్థులైన అంజిరెడ్డి, నరేందర్ రెడ్డిలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన ఓటర్లు రెండు లేదా మూడో ప్రాధాన్యత ఓటు ఎవరికి వేసి ఉంటారనేదానిపై జోరుగా చర్చ జరుగుతోంది. గురువారం పోలింగ్ ముగియగా, మార్చి 3న ఓట్లు లెక్కించనున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్లు బిసీ వాధం పనిచేసిందా లేదా అనే ఫలితాల నాడు స్పష్టం కానుంది. రాజకీయంగా తమ భవిష్యత్తు కార్యచరణకు ఎమ్మెల్సీ ఎన్నికలు తోలి అడుగు అని చెప్పాలి.

