కామారెడ్డి, బతుకమ్మ : ఒక మహిళ అయి ఉండి లిక్కర్ వ్యాపారం చేసి అందరిని తాగుబోతులుగా మార్చి క్రైమ్ రేట్ పెంచారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ వర్గాల ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఒక ప్రకటనలో తెలిపారు. జైలుకుపోయి వచ్చిన నాయకులు క్రైమ్ రేట్ పెరిగిందని మీడియా సమావేశం పెట్టి చెబుతున్నారని ఎద్దేవా చేశారు. తాము గాలి మాటలు మాట్లాడమని అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. ఈరోజు నిధులు తీసుకోవచ్చాం అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. నిజామాబాద్ ప్రజలందరికీ గుట్కా దందా చేసేవారు ఎవరో తెలుసని పేర్కొన్నారు. ఇసుక దందా, అక్రమ బియ్యం వ్యాపారం చేసేవారు ఏ పార్టీ వారో ప్రజలందరికీ తెలుసన్నారు. నిజామాబాద్ పట్టణ అభివృద్ధి కొరకు టీయూఎఫ్ఐడీసీ నిధులు 60 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి తో ప్రత్యేకంగా మాట్లాడి నిధులు మంజూరు చేయించానని తెలిపారు. పట్టణంలోని దాదాపు అన్ని డివిజన్లకు డ్రెయిన్, సీసీ రోడ్లు, కల్వర్టులు, పట్టణ అభివృద్ధి కోసం టీయూఎఫ్ఐడిసీ నిధులు మంజూరు చేయించానని తెలిపారు. తాను మాటలతో అభివృద్ధి చేయనని చేతలతో అభివృద్ధి చేసి చూపిస్తాని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో 55 వేల ఉద్యోగాలు ఇచ్చిందని అన్నారు. ఇంకో 50,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బిజెపి నాయకులు మాటలు చెబుతారు గాని అభివృద్ధి చేయరని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ సంవత్సరానికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఎన్ని ఇచ్చాడు ప్రతి ఖాతాలో 15 లక్షలు నల్లధనం వేస్తానని ఎంతమందికి వేశాడని ప్రశ్నించారు. దేశాన్ని దోపిడీ చేసి పారిపోయిన ఎగవేత దారులను దేశానికి తిరిగి తెప్పిస్తానని ఎంతమందిని తీసుకొచ్చాడని అన్నారు. దేశాన్ని దోచి ఆదాని, అంబానీలకు పెడుతున్నారని, ప్రపంచం మొత్తం అదాని డిఫాల్టర్ అంటుంటే నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రాన్నిగా మార్చి 8 లక్షల కోట్లు అప్పు చేసిందని అన్నారు. ఈ రోజు రైతులకు రుణమాఫీ కాలేదు అంటూ గగ్గోలు పెడుతున్నారని, మీరు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో రుణమాఫీ ఎంత చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే దఫా రెండు లక్షల రుణమాఫీ చేసి 21వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేసిందని మిగతా వారికి కూడా చేస్తామని తెలిపారు. సంక్రాంతి కి రైతు భరోసా కూడా అందజేస్తామని అన్నారు. ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు. రాష్ట్రం మొత్తం 25 లక్షల నిరుపేదలకు ఇల్లు అందిస్తామని అన్నారు. దానికోసం 12వేల 500 కోట్లు నిధులు విడుదల చేస్తున్నామని అన్నారు. దానికోసం ప్రత్యేకమైన యాప్ ను విడుదల చేసి దాంట్లోనే అందరూ అప్లై చేసు కోవాలని ఇందిరమ్మ ఇండ్లకు సర్వే కూడా మొదలుపెట్టామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని అన్నారు. ఆరు గ్యారెంటీల్లో అన్ని అమలు చేసాం ఎన్నికల్లో హామీ ఇచ్చిన దానికంటే ఎక్కువగానే అమలు చేసామని తెలిపారు.