. . . నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరిలో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ లోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఆదివారం సాయంత్రం నుడా ఫండ్స్ ద్వారా మంజూరైన రూ.9 లక్షల నిధులతో నిర్మించనున్న వాకింగ్ ట్రాక్‌కు అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాకింగ్ అనేది సర్వరోగ నివారిణి అని, ప్రతి వ్యక్తి రోజుకు కనీసం అరగంట వాకింగ్ చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని తెలిపారు. పాలిటెక్నిక్ మైదానానికి ప్రతిరోజూ 5 వేల నుంచి 10 వేల మంది వరకు వాకింగ్ కోసం వస్తుంటారని, అలాంటి వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని వాకింగ్ ట్రాక్ నిర్మాణం అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే గత 12 సంవత్సరాలుగా నిరంతరం వాకింగ్‌కు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అశోక్ అని ఎక్స్ సర్వీస్ మాన్ తన శక్తి మేరకు సహకరిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని, ఆరోగ్యంపై ఉన్న అవగాహనతో ఆయన చేస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. ప్రభుత్వం ద్వారా రూ.9 లక్షల నుడా నిధులు మంజూరైనప్పటికీ అవి సరిపోకపోతే తన వంతుగా ఉడతా భక్తిగా సహాయం చేసి శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడేలా అన్ని సౌకర్యాలతో వాకింగ్ ట్రాక్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

