. . . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
భీమ్‌గల్, బతుకమ్మ :
భీమ్‌గల్ పట్టణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన పలు అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిచిపోయాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. భీమ్‌గల్ పట్టణంలో ఆదివారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పర్యటించిన ఆయన, అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను పరిశీలించి అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భీమ్‌గల్ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.35 కోట్ల వ్యయంతో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసిందని ఆయన తెలిపారు.

ఇందులో రూ.22 కోట్లు భవన నిర్మాణానికి, రూ.5 కోట్లు వైద్య పరికరాలకు, రూ.8 కోట్లు ఇతర ఖర్చులకు కేటాయించామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రూ.16 కోట్లతో ఆసుపత్రి నిర్మాణ పనుల్లో 75 శాతం పూర్తి చేసి, కాంట్రాక్టర్‌కు రూ.13 కోట్ల బిల్లులు చెల్లించినట్లు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మూడు నెలల్లో ఆసుపత్రిని పూర్తి చేసి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని, ఎన్నికలు ముగిసి నాలుగు నెలలు గడిచినా ఆ హామీ నెరవేరలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిరిగానే మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఆరోపించారు. జూలై 14 లోపు 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించకపోతే భీమ్‌గల్ ప్రజలు కాంగ్రెస్ నాయకులను నిలదీస్తారని హెచ్చరించారు.

అలాగే భీమ్‌గల్‌లో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ పనులు కూడా రెండున్నర సంవత్సరాలుగా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.7 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఎక్కువ భాగం బీఆర్ఎస్ హయాంలో పూర్తయిందని, కాంట్రాక్టర్‌కు రావాల్సిన బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయని అన్నారు. భీమ్‌గల్ బస్ డిపోను గత ప్రభుత్వ హయాంలో రూ.2.10 కోట్లతో ఆధునీకరించి కొంతకాలం విజయవంతంగా నడిపినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పునరుద్ధరించడంలో విఫలమైందని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నాయకులు పూర్తిగా విస్మరించారని విమర్శించారు. అదేవిధంగా, భీమ్‌గల్ మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు, ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం గత ప్రభుత్వం రూ.11.5 కోట్లు మంజూరు చేసినప్పటికీ, ప్రస్తుతం పనులు పూర్తికాక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. బడా భీమ్‌గల్ బ్రిడ్జి వరదల్లో దెబ్బతిని ఏడాది దాటినా మరమ్మతులు చేపట్టకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. గెలిచినా, ఓడినా బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుంది. అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తూనే ఉంటామని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేశారు. జూలై 14లోగా 100 పడకల ఆసుపత్రి ప్రారంభం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనుల పునఃప్రారంభం, భీమ్‌గల్ బస్ డిపో పూర్తి స్థాయిలో నిర్వహణ, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల పూర్తి, బడా భీమ్‌గల్ బ్రిడ్జి మరమ్మతులు చేపట్టాలని కోరారు. నెల రోజుల్లోగా ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే భీమ్‌గల్ ప్రజలతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉధృత ఆందోళనలు చేపడతామని, కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు.

