24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఇందూరు జిల్లాను ఎడారిగా మారుస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

గత 18 ఏళ్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పాలనలో ఇందూర్ జిల్లా సాగునీటి రంగంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, దీనివల్ల జిల్లా ఎడారిగా మారుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ధ్వజమెత్తారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులైన శ్రీరాంసాగర్ (ఎస్సారెస్పీ), నిజాంసాగర్ ప్రాజెక్టులను గత కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే వైఖరిని కొనసాగిస్తోందన్నారు. గత 30 నెలలుగా ప్రాజెక్టుల అభివృద్ధి కోసం కనీస పనులు కూడా చేపట్టలేదని విమర్శించారు. ప్యాకేజీ – 21 కింద బినోల నుంచి సారంగాపూర్ వరకు సుమారు రూ.900 కోట్ల వ్యయంతో నిర్మించిన అండర్‌గ్రౌండ్ పంపింగ్ వ్యవస్థను ట్రయల్ రన్ చేసినప్పటికీ ఇప్పటికీ వినియోగంలోకి తీసుకురాలేదన్నారు. ఎస్సారెస్పీలో నీటి మట్టం పెరిగిన సమయంలో సరైన నిర్వహణ లేకపోతే పంపులు మునిగిపోయి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. సారంగాపూర్ నుంచి కొండెం చెరువు వరకు 9 కిలోమీటర్ల మేర సుమారు రూ.1,200 కోట్లతో చేపట్టిన పనులు పూర్తయినా, గుత్ప, అలీసాగర్ పరిధిలోని 47 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన 10 వేల క్యూసెక్కుల నీటిని కాలువ మోయలేని పరిస్థితి ఉందన్నారు. కాలువ సామర్థ్యం తక్కువగా ఉండటంతో నీరు వంతెనలను తాకుతున్నదని, గత 18 ఏళ్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు కాలువల విస్తరణపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. సారంగాపూర్ నుంచి మోపాల్, డిచ్‌పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, జక్రాన్‌పల్లి, సిరికొండ ప్రాంతాల్లోని లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలంటే సుమారు 10 టీఎంసీల నీరు అవసరమని, అయితే ప్రస్తుతం 47 వేల ఎకరాలకు కూడా నీరు అందించే స్థాయిలో కాలువ సామర్థ్యం లేదని తెలిపారు. కాలువను విస్తరించినప్పుడే లక్ష ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

 

The Congress and BRS governments are turning Indur district into a desert.

 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో మరో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించి, రూ.18 వేల కోట్లతో కొండెం చెరువు కింద పైపులైన్ పనులు చేపట్టిందన్నారు. బైరాపూర్, మెట్రజ్‌పల్లి వద్ద భారీ పంప్ హౌస్‌లు నిర్మించినప్పటికీ ఇప్పటివరకు ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందలేదని విమర్శించారు. మంచిప్ప, బైరాపూర్, అమ్రాబాద్, కల్పోల్ తదితర తండాల్లో ఒక్క ఎకరం భూమి కూడా మునగకుండా బైరాపూర్ పంప్ హౌస్ ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి, సుదర్శన్ రెడ్డిని డిమాండ్ చేశారు. పైపులైన్ పనులు పూర్తయిన ప్రాంతాల్లో కూడా కాలువల నిర్మాణం పేరుతో కమిషన్ల కోసమే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో బాజిరెడ్డి గోవర్ధన్, కవితల మధ్య కమిషన్ల వివాదాలతో ప్రాజెక్టు నష్టపోయిందని, ప్రస్తుతం భూపతి రెడ్డి, సుదర్శన్ రెడ్డిల మధ్య కమిషన్ల రాజకీయాల వల్ల కూడా ప్రాజెక్టులు దెబ్బతింటున్నాయని విమర్శించారు. నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఆ హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని పేర్కొన్నారు. గత 18 ఏళ్లుగా సాగునీరు అందక వ్యవసాయం దెబ్బతినడంతో జీవనోపాధి కోసం సుమారు రెండు లక్షల మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని ఆరోపించారు. అన్నపూర్ణగా పేరొందిన నిజామాబాద్ జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి ప్రాజెక్టులు 20, 21, 22పై కనీస అవగాహన కూడా లేదని ఆరోపిస్తూ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రాజెక్టులను ఎలా ముందుకు తీసుకెళ్తారని ప్రశ్నించారు. రూ.18 వేల కోట్లతో నిర్మించిన పైపులైన్లు భూమిలోనే ఉండిపోయాయని, వాటి ద్వారా ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందడం లేదని పేర్కొన్నారు. పాత డిజైన్ల పేరుతో మళ్లీ రైతులను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, కమిషన్ల కోసమే రైతు ప్రయోజనాలను పక్కనపెడుతున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల విషయంలో రైతులను మరోసారి మోసం చేస్తే రైతులు, ప్రజలను ఏకం చేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గద్దె భూమన్న, నక్క రాజేశ్వర్, ఓం సింగ్, ఆనంత్ రెడ్డి, కర్క గంగారెడ్డి, చింత శ్రీనివాస్ రెడ్డి, నరేష్, శంకర్ రెడ్డి, శశాంక్, జగన్ రెడ్డి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

 

The Congress and BRS governments are turning Indur district into a desert.

More articles

Latest article