. . . మున్సిపల్ యూనియన్ రాష్ట్ర నాయకులు పి.సుధాకర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని మున్సిపల్ యూనియన్ రాష్ట్ర నాయకులు పి.సుధాకర్ అన్నారు. నిజామాబాద్ నగర సిఐటియు కార్యాలయంలో మంగళవారం తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు వెంటనే రెండవ పి ఆర్ సి ని ప్రకటించాలని, అందులో భాగంగా మున్సిపల్ కార్మికులందరికీ రూ.26 వేల వేతనం చెల్లించాలని, కార్మికులకు ఇవ్వాల్సిన పనిముట్లు, రెయిన్ కోట్స్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం వెంటనే కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెరుగుతున్న జనాభా కనుగుణంగా కార్మికులను పెంచాలని, ఫిట్ నెస్ లేని, లైసెన్స్ లేని, ఇన్సూరెన్స్ లేని, బండ్లను నడపరాదని దానికి మున్సిపల్ యాజమాన్యం బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయనన్నారు. కార్మికుల సమస్యలను వెంటనే తీర్చాలని లేని ఎడల రాష్ట్ర వ్యాప్త సమ్మెకు సిద్ధపడాల్సి వస్తుందని ఆయన తెలిపారు. అనంతరం నిజామాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నగర కమిటీని ఎన్నుకున్నారు. మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గా ఏ. రమేష్ బాబు, అధ్యక్షులుగా కే. భూపతి, ఉపాధ్యక్షులుగా బి. మహేష్, సుర రవి, వసంత, సహాయ కార్యదర్శిగా రాకేష్, అమూల్, దశరథ్, ప్రధాన కార్యదర్శిగా ఎం. నరేష్, ప్రచార కార్యదర్శిగా మోహన్ లతో పాటు కమిటీ సభ్యులుగా మరో తొమ్మిది మందిని ఎన్నుకున్నారు.
