ఆ ఈఈకి అదనపు బాధ్యతలు వద్దు

0 8,126
  • ఎమ్మెల్యే హుకుంతో నిలిచిపోయిన బాధ్యతల స్వీకరణ
  • నీటిపారుదల శాఖలో వెక్కిరిస్తున్నఖాళీలు
  • వర్షాకాలంలో శాఖకు తప్పని తిప్పలు

బతుకమ్మ, నిజామాబాద్
నిజామాబాద్ జిల్లాలో నీటిపారుదల శాఖను ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. దానికి తోడు రిక్రూట్ మెంట్ లేకపోవడంతో ఇంచార్జిలుగా ఉన్నఅధికారులకే బాధ్యతలను అప్పగిస్తున్నారు. అయితే అందులోనూ రాజకీయ జోక్యం పెరుగడంతో ఇంచార్జిలుగా చేసేందుకు ఎవరు ముందుకు వచ్చినా వారికి బాధ్యతలు అప్పజేప్పేందుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. అందుకు నిజామాబాద్ జిల్లాలో వెక్కిరిస్తున్న ఉన్నతాధికారుల ఖాళీ పోస్టులే నిదర్శనమని చెప్పాలి. నిజామాబాద్ నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ పరిధిలో ఒక ఎస్ఈతో పాటు నాలుగు ఐబీ డివిజన్ లు ఉన్నాయి. ప్రస్తుతం  నిజామాబాద్ జిల్లాలో డిప్యూటీ సీఈ, డిప్యూటీ ఎస్ఈ, నిజామాబాద్ ఐబీ డివిజన్ ఈఈ పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో మొన్నటి వరకు ఐబీ డివిజన్ లో పని చేసిన అశోక్ కుమార్ గత నెలలో రిటైర్మెంట్ కాగా ఆయన స్థానంలో ప్రభుత్వం ఎవరిని నియమించలేదు. దానితో ప్రస్తుతం కీలకమైన మూడు పోస్టులకు అధికారులు కరువయ్యారు. నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా బోధన్, మోర్తాడ్, ఆర్మూర్ ఐబీ డివిజన్ లో మాత్రమే అధికారులు ఉన్నారు. ఇటీవల వర్క్ అడ్జెస్ట్ మెంట్ పేరుతో ముగ్గురు అధికారులకు డిప్యూటేషన్ వేశారు.అందులో ఒకరు మాత్రమే అదనపు బాధ్యతలు స్వీకరించగా మరొకరు అనారోగ్యం సమస్యలతో విధుల్లో చేరలేదు. ఒక ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ విధుల్లో చేరేందుకు ఆసక్తి చూపినా నిజామాబాద్ కు చెందిన ఒక ఎమ్మెల్యే అతనికి అదనపు బాధ్యతలు ఇవ్వొద్దని అధికారులకు హుకుం జారీ చేసినట్లు తెలిసింది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆదేశాలు పాటిస్తూ ఇంచార్జి అధికారిగా ఆయనకు డిప్యూటేషన్ విధులను అప్పజెప్పేందుకు అధికారులు వెనుకడుగు వేశారు. దానితో నిజామాబాద్ జిల్లాలో మూడు కీలక పోస్టులకు అధికారులు లేకుండాపోయారు. ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా అధికారులు మూడు జిల్లాలపై పెత్తనం చేసిన చరిత్ర ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు జిల్లాలకే నిజామాబాద్ అధికారులు పరిమితమయ్యారు. జిల్లాల పునర్విభజన తర్వాత నీటిపారుదల శాఖ అధికారుల అధికారాలకు కత్తెర పడింది. ఒక్క ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లే కాకుండా డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టెక్నికల్ ఆఫీసర్లను డిప్యూటేషన్ పై పని చేయిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో పని చేస్తున్న అధికారులు సీనియర్లు అయినప్పటికీ వారికి ఎలాంటి అధికారాలు లేకపోవడంతో ప్రభుత్వ నిర్ణయాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. గత నెలలో నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో అతలాకుతలమైంది. ప్రాణనష్టం, ఆస్తినష్టం లేకపోయినా చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లిన అధికారుల అప్రమత్తతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. అయితే కీలకమైన అధికారులు పోస్టులు ఖాళీగా ఉండడం, కొందరు అనారోగ్యంతో చేరకపోవడం, చేరుతామన్నవారిని అధికార పార్టీ నేతలు అడ్డుకోవడంతో ప్రభుత్వ నిర్ణయం కోసం అధికారులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరో నెల రోజులు వర్షాకాలం ఎలా వెళ్లదీయాలో తెలియక నీటిపారుదల శాఖాధికారులు సతమతమౌతున్నారు. మరికొంత మంది అధికారులు పదోన్నతులు వస్తే ఆయా పోస్టులకు కూడా దిగువ స్థాయి అధికారులతోనే ఇంచార్జిలుగా కాలం వెల్లదీసే పరిస్థితి నెలకొంది.

Leave A Reply

Your email address will not be published.