- అధిష్టానానికి తలనొప్పిగా మారిన ప్రెస్ మీట్
- మంత్రి అడ్లూర్ పై నోరు పారేసుకున్న మంత్రి పొన్నం
- క్షమాపణ చెప్పకపోతే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానన్న అడ్లూరి
- అడ్లూరి లక్ష్మణ్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్న పొన్నం
- మండిపడుతున్న దళిత సంఘాలు
హైదరాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కాస్తా రచ్చకెక్కుతున్నాయి. అసలే మంత్రివర్గ విస్తరణ జరుగక అధికార పార్టీలో ఎమ్మెల్యేల మధ్య సఖ్యత కరువైంది. అదే సమయంలో అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహరం కాకపుట్టిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని అధికార పార్టీలో ఆందోళన వ్యక్తమౌతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వ్యవహరంలో పోటీ చేసే అభ్యర్థిని ఎంపిక చేసేందుకు హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే పొన్నం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో మంటలు పుట్టిస్తుంటే సహచర మంత్రి వివేక్ పై అడ్లూరి లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు ఈ వ్యవహరాన్ని సద్దుమనింపించేందుకు బాధ్యతలు అప్పగించినా అవి చల్లారలేదు. చివరకు రాష్ట్ర పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని రెహమత్ నగర్ లో ఈ నెల 6న జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ లు పాల్గొనాల్సి ఉంది. అయితే అడ్లూరి మీడియా సమావేశం ప్రారంభానికి ఆలస్యంగా రావడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ పక్కనే ఉన్న మంత్రి వివేక్ వెంకటస్వామితో చెవిలో గుసగుసలాడటం అది కాస్తా మైకుల్లో మనకు సమయం తెలుసు, జీవితం తెలుసు కానీ వారికేం తెలుసు దున్నపోతు గానికి అంటూ మాట్లాడిన మాటలు బయటకు వినిపించాయి. సంబంధిత వ్యాఖ్యలు మంత్రి అడ్లూరిని ఉద్దేశించి చేసినవిగా మీడియాలో వైరల్ అయ్యాయి. దానిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేసి పొన్నంప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడిన అడ్లూరి లక్ష్మణ్ సహచర మంత్రి వివేక్ వెంకటస్వామి తనను చూసి ఓర్చుకోవడం లేదని పేర్కొన్నారు. మాదిగ సామాజిక వర్గం నుంచి వచ్చిన తనను తక్కువ చేసి చూస్తున్నారని, మంత్రి తనను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తమను సొంత పార్టీ మంత్రులే తులనాడుతుంటే దళిత సంఘాలు స్పందించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. తాను మంత్రిగా వివేక్ వెంకటస్వామి పాల్గొన్న సమావేశాలకు హాజరైతే పక్కన కూర్చుండడం లేదని అంటు చేసిన వ్యాఖ్యలు కలకలంరేపాయి. అయితే పొన్నం ప్రభాకర్ ఒక వీడియోను విడుదల చేసి తాను మంత్రి అడ్లూరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చుకున్నారు. తాను దున్నపోతు అన్నప్పుడు మంత్రి లక్ష్మణ్ పేరు ఎక్కడ ప్రస్తావించలేదని గుర్తుచేశారు. తమ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని, అడ్లూరితో మాట్లాడేందుకు ప్రయత్నించిన ఆయన స్పందించలేదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఇద్దరి మంత్రుల మధ్య పంచాయితీ వ్యవహరం కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కలకలం రేపింది. ఇద్దరు మంత్రుల వివాదం ముగ్గురు మంత్రుల చుట్టు తిరుగడంతో స్థానిక సంస్థల ఎన్నికల వేళ తప్పుడు సంకేతాలు వెళ్తాయని స్వయంగా పీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. ఆయన ఇద్దరు మంత్రులతో మాట్లాడారు. ఈ వ్యవహరంలో బుధవారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మహేష్ కుమార్ గౌడ్ చర్చించనున్నట్లు తెలిసింది. ఇద్దరు మంత్రుల మధ్య జరిగిన సంభాషణ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై చర్చ జరుగుతున్నా అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ తో ఆరా తీసినట్లు తెలిసింది. ఈ విషయంలో కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ద్వారా సెట్ చేసేందుకు పార్టీ ఆయనకు బాధ్యతలు అప్పగించినట్లు చర్చ జరుగుతుంది.