24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రపంచమంతా తెలుగు వెలగాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మాతృ భాషను కాపాడుకోవాలి

 

. . . తెలుగు సమాజం మొత్తం గర్వించతగ్గ మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి

 

. . . భారత 13 వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలుగు భాష ప్రపంచమంతా వెలగాలని భారత 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్, బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గురువారం తెలుగు జాతి వైతాళికుడు, జనచైతన్య దీపం సురవరం ప్రతాపరెడ్డి 130వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు, ప్రముఖ సాహితీ వేత్త, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత నందిని సిధారెడ్డి కి సురవరం ప్రతాపరెడ్డి పురస్కారాన్ని అందజేసి ప్రసంగించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర మహాసభ స్థాపనలో కీలక పాత్ర పోషించి, మొదటి ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించిన సురవరం ప్రతాపరెడ్డి తెలుగు ప్రజలలో చైతన్యం తీసుకురావడమే కాకుండా ఆ రోజుల్లో తెలుగు భాష వికాసానికి విశేష కృషి చేశారన్నారు.

 

Telugu breeze all over the world

 

తెలుగు భాషా సాహిత్యానికి కృషి చేస్తున్న ఎందరో కవులు, రచయితలకు గొప్ప ఆలంబనగా నిలిచారని, వారి స్ఫూర్తితో నేటితరం తెలుగు భాష వెలుగుకు కృషి చేయాలన్నారు. తెలుగు సమాజం మొత్తం గర్వించతగ్గ మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి అని నివాళులర్పించారు. తెలంగాణలో కవులున్నారా అన్న ప్రశ్నకు గోల్కొండ కవుల సంచిక ద్వారా చేతలతో సమాధానమిచ్చిన పరిశోధక చైతన్య శీలి సురవరం అని, ఇప్పటిలాగా సమాచారం కోసం ఇంటర్నెట్, గూగుల్ సెర్చ్ లేదా డిజిటల్ లైబ్రరీలు లేని ఆ రోజుల్లోనే… ఊరూరా తిరిగి, ప్రతి ఒక్కరిని కలిసి 354 మంది కవుల జీవితాలను ఆవిష్కరించడం సామాన్యమైన విషయం కాదని, పరిశోధనా రంగానికి ఆయన చేసిన ఈ కృషి ఒక గీటురాయి లాంటిదని పేర్కొన్నారు. నాటి నిజాం నిరంకుశత్వానికి ఎదురొడ్డి ‘గోలకొండ పత్రిక’ ద్వారా విలువలతో కూడిన జర్నలిజానికి సురవరం ప్రతాప రెడ్డి శ్రీకారం చుట్టారని, కేవలం పత్రికకే పరిమితం కాకుండా, ఆయన కలం నుండి జాలువారిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’, ‘హిందువుల పండుగలు’, ‘హైందవ ధర్మ వీరులు’ వంటి అద్భుత గ్రంథాలు… ప్రతి తెలుగువాడూ చదివి, తన ఇంట్లో దాచుకోదగిన అమూల్యమైన సాహిత్య నిధులని చెప్పారు.

 

Telugu breeze all over the world

 

తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి, గ్రంథాలయోద్యమానికి ఎనలేని సేవలు అందించిన సురవరం… బహుముఖ ప్రజ్ఞాశాలిగా, ఉత్తమ పరిశోధకుడిగా ఎంత ఎదిగినా, జీవితాంతం నిరాడంబరునిగా, నిరంతర అధ్యయన శీలిగానే జీవించారని, వారిని నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలని ఆకాంక్షించారు. మీడియా రంగంలో కొన్ని వర్గాల ప్రస్తుత ధోరణిపై ఆందోళన వ్యక్తం చేస్తూ పాత్రికేయ విలువలు క్షీణించటం ప్రజాస్వామ్య పునాదుల్ని బలహీనం చేస్తుందన్నారు. పత్రికలకు ఆర్థిక వనరులు అవసరమే కానీ, ఆర్థిక వనరులే పరమార్థం కాకూడదు, విలువలే మూలాలుగా ఉండాలని సూచించారు. జర్నలిజంలో అర్థం లేని పోటీ తత్వం పోవాలని, సమాచారాన్ని ఎంత వేగంగా అందించామనే విషయం మీదకన్నా, వాస్తవాలను ఎంత సమగ్రంగా అందించామనే విషయం మీదనే మీడియా దృష్టి పెట్టాలని సూచించారు. కొంత మంది బైట్స్ తీసుకుని వాటితో ఫైట్స్ పెడుతున్నారని తనదైన శైలిలో చమత్కరించారు. సమాజంలో మాతృభాషను కాపాడుకునే చొరవ మరింత పెరగాలని, దాంతో పాటు ప్రజల ఆరోగ్యం, వ్యవసాయం తదితర రంగాల గురించి అవగాహన కల్పించటంలో పత్రికలు సమర్థమైన పాత్ర పోషించాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో సురవరం ప్రతాప రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివా రెడ్డి, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, శాంతా వసంతా ట్రస్టు వ్యవస్థాపకులు వరప్రసాద రెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి పురస్కార గ్రహీత నందిని సిధారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి కుటుంబసభ్యులు డాక్టర్ సురవరం కృష్ణవర్ధన్ రెడ్డి, డాక్టర్ సురవరం పుష్పలతా రెడ్డి, కపిల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Telugu breeze all over the world

More articles

Latest article