- అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్, బీజేపీ నేతల ప్రచారం
నిజామాబాద్, బతుకమ్మ : ఉత్తర తెలంగాణ జిల్లా నేతలకు ఎలక్షన్ ఫీవర్ పట్టుకుంది. తెలంగాణలో ప్రస్తుతానికి ఎలాంటి ఎన్నికల హడావుడి లేకపోయినప్పటికీ పొరుగున ఉన్న మహారాష్ట్రలో మొదటి విడత శాసనసభ, పార్లమెంట్ ఉప ఎన్నిక ఈ నెల 20న జరుగనుంది. దాంతో అక్కడ ప్రచారానికి తెలంగాణ నేతలు తరలివెళ్లారు. ప్రధానంగా మహారాష్ట్రకు సరిహద్దున పూర్వ తెలంగాణ జిల్లాలైనా నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ తో సుదీర్ఘ సరిహద్దు ఉంది. అందులో ప్రధానంగా నాందేడ్ జిల్లాకు నిజామాబాద్ పొరుగునే ఉండడంతో రాకపోకలతో పాటు రాజకీయ వాణిజ్య సంబంధాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ అభ్యర్థుల గెలుపు ఓటముల్లో నిజామాబాద్ పాత జిల్లాకు ప్రమేయం ఉంటుంది. ఉపాధి, వ్యాపార నిమిత్తం రాకపోకలు ఉండడంతో మహారాష్ట్రకు చెందిన వారు రెండు జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎన్నికల ప్రచారానికి స్థానిక నేతలు తరలివెళ్లారు.

ఎందుకంటే గడిచిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మహారాష్ట్ర నేతలు నిజామాబాద్ జిల్లాలో ప్రచారం చేశారు. నాందేడ్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఆదివారం దెగ్లూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బిలోలి తాలుకాలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఉన్నారు. ఇప్పటికే నాందేడ్ జిల్లాలో నిజామాబాద్ కు చెందిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీతో పాటు జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కార్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావులు ప్రచారం చేస్తున్నారు. వారికి కామారెడ్డి జిల్లాకు చెందిన తెలంగాణ అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు కూడా ప్రచారం చేస్తున్నారు. నాందేడ్ జిల్లాలోని బాట్ల, బోర్గం గ్రామాల్లో ఆదివారం అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ప్రచారం చేశారు. బీజేపీని గెలిపించాలని అక్కడ ఓటర్లకు అభ్యర్థించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో నాందేడ్ జిల్లాలో పోటీ చేసిన మజ్లీస్ పార్టీ ఈసారి ఔరంగాబాద్ జిల్లాకే పరిమితమైంది. నిజామాబాద్ జిల్లా మజ్లీస్ నేతలు అక్కడ గెలుపు కోసం గత 12 రోజులుగా అక్కడ క్యాంప్ వేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో చేరికలతో పాటు భారత రాష్ట్ర సమితి విస్తరణకు బహిరంగ సభలు నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి అటువైపు కన్నెత్తి చూడడం లేదు. గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసి బోణి కొట్టినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత విస్తరణ అటుంచి మహారాష్ట్రలో కార్యకలాపాలకు ఫుల్ స్టాఫ్ పెట్టినట్లయింది. గత వారం రోజులుగా నాందేడ్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాత్రమే ప్రచారంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు.

