26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులను రద్దు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపు, అభ్యాసనా సామర్థ్యాల పెంపునకు ఉపాధ్యాయులే బాధ్యత వహించాలని చెప్పిన అధికారులు.. ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని ఏక పక్షంగా ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని స్టేట్ టీచర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ధర్మేందర్శ్రీకాంత్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులను లేకుండా చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ఏటేటా తగ్గిపోతోందని, ఈ సంవత్సరం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపుకోసం కృషి చేద్దామని చెప్పిన విద్యాశాఖ అధికారులు ఏకపక్షంగా సర్దుబాటు ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. పాఠశాలలు ప్రారంభం కాకముందే విద్యార్థుల సంఖ్య నమోదును పట్టించుకోకుండా జూన్ 13వ తేదీ నాటికే సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడంలో ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదని పేర్కొన్నారు.

గత సంవత్సరం యూడీఐఎస్ఈ ప్రకారం విద్యార్ధుల సంఖ్యను తీసుకొని సర్దుబాటు చేయడం అనాలోచిత చర్య అని, అలాంటప్పుడు బడి బాట నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలని, తరగతికో ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, సంఘాలు కోరుతున్నా పట్టించుకోకుండా ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులను సర్దుబాటు పేరిట ఇతర పాఠశాలలకు తరలించాలనే నిర్ణయం ప్రాథమిక విద్యా రంగానికి గొడ్డలి పెట్టని, సర్దుబాటు నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

More articles

Latest article