ట్యాబ్ ఎంట్రీలు వేగంగా చేయాలి

0 15,433
  • కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

 

ఏర్గట్ల, బతుకమ్మ : ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాలలో సకాలంలో బిల్లులు జమ అయ్యేందుకు ట్యాబ్ ఎంట్రీలను వెంటవెంటనే చేయించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ఏర్గట్ల మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంను సందర్శించి భూభారతి దరఖాస్తుల పరిష్కారం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియ అమలు తీరుపై సమీక్ష జరిపారు. కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన సందర్భంగా ఇప్పటి వరకు ఎంత పరిమాణంలో ధాన్యం సేకరించారు, ఎన్ని లారీల లోడ్ల ధాన్యం మిల్లులకు తరలించారు, ఇంకా ఎన్ని లోడ్ల ధాన్యం కేంద్రానికి వస్తుంది, వరి కోతలు పూర్తయ్యాయా  తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిల్లులకు ధాన్యం పంపిన వెంటనే దిగుమతి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని, వెంటవెంటనే ట్రక్ షీట్లు తెప్పించుకుని ట్యాబ్ ఎంట్రీలు చేయించాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న ట్యాబ్ ఎంట్రీలన్నీ ఈ రోజే పూర్తి చేయాలని అన్నారు.  అంతకుముందు తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ రెవెన్యూ అధికారులు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని  సూచించారు. ఎస్.ఐ.ఆర్ అమలు కోసం 2002, 2025 ఓటరు జాబితాలను  మ్యాపింగ్ చేసి రూపొందించిన వివరాలను పరిశీలించి, పలు సూచనలు చేశారు. మ్యాపింగ్ లో తప్పిదాలు లేకుండా మరోమారు పోలింగ్ కేంద్రం వారీగా క్షుణ్ణంగా పరిశీలన చేయాలన్నారు. భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. సాదాబైనామా అర్జీలను తిరస్కరిస్తే, అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని అన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మల్లయ్య, స్థానిక అధికారులు ఉన్నారు.

Tab entries should be made faster

Leave A Reply

Your email address will not be published.