. . . మధ్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం…
డిచ్ పల్లి, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వహించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు అమర్ సింగ్ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. 2026 సెప్టెంబర్ 15 నుంచి 22వ తేదీ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో నిర్లక్ష్యం జరిగినట్లు పలు పత్రికల్లో ప్రచురితమైన కథనాలతో పాటు సంబంధిత అధికారులకు అందిన ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్, ఈ ఉదంతంపై విచారణ జరిపించారు. ఈ సందర్భంగా మద్యాహ్న భోజనం అమలులో అలసత్వం చోటుచేసుకున్నట్లు వెల్లడి కాగా, విచారణ నివేదిక ఆధారంగా, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఇంచార్జి హెచ్.ఎం అమర్ సింగ్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, ప్రయోజనాల అమలులో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.
