24.5 C
Hyderabad
Friday, July 31, 2026

పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే 

Must read

📰 Generate e-Paper Clip

  •  కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు 
  •  మొబైల్ యాప్ సర్వే విధానంపై అవగాహన సమావేశం 

నిజామాబాద్, బతుకమ్మ: ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ డివిజన్లు, వార్డులలో క్షేత్రస్థాయిలో చేపట్టే సర్వే ప్రక్రియను ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం ప్రభుత్వం రూపొందించిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్ ద్వారా సర్వే నిర్వహించాల్సిన విధానంపై మున్సిపల్ కమిషనర్లు, ఆయా మండలాల ఎంపిడిఓలు, తహశీల్దార్లకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు. మొబైల్ యాప్ ను వినియోగిస్తూ క్షేత్రస్థాయిలో సర్వే చేయాల్సిన తీరును ఒక్కో అంశం వారీగా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పిస్తూ, వారి సందేహాలను నివృత్తి చేశారు. ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి ఏయే అంశాలను పరిశీలించాలి, మొబైల్ యాప్ లో వివరాలను ఏవిధంగా పొందుపర్చాలి అనే అంశాలను పీ.పీ.టీ ద్వారా ప్రయోగాత్మకంగా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయి సర్వే కోసం ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల కార్యదర్శులు, ఇతర సిబ్బంది అందరికి యాప్ ద్వారా సర్వే జరపాల్సిన విధానంపై శనివారం అన్ని మండలాలలో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని ఎంపిడిఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. సర్వే సందర్భంగా దరఖాస్తుదారుల వివరాలను పక్కాగా సేకరిస్తూ, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా యాప్ లో వివరాలను అప్లోడ్ చేయాలని సూచించారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరపాలని అన్నారు. ఎక్కడైనా అవకతవకలకు పాల్పడితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిన కలెక్టర్, ఇదివరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరీలో చోటుచేసుకున్న పరిణామాల గురించి ఈ సందర్భంగా  ఉటంకించారు. ఎలాంటి వివాదాలు, అవకతవకలకు తావులేకుండా సర్వే ప్రక్రియను నిజాయితీగా, నిబద్ధతతో చేపడుతూ గడువులోపు పూర్తి చేయాలని సూచించారు. అవగాహన సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీఆర్డీఓ సాయాగౌడ్, నిజామాబాద్, ఆర్మూర్ ఆర్డీఓలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్, ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Survey of Indiramma houses transparently

More articles

Latest article