26.2 C
Hyderabad
Monday, August 3, 2026

విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఇన్‌స్పెక్టర్ నరహరి

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

పాఠశాలలు పునఃప్రారంభమై నూతన విద్యా సంవత్సరంలో అడుగుపెడుతున్న విద్యార్థులకు కామారెడ్డి పోలీసుల తరఫున ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నరహరి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు కొత్త ఉత్సాహం, కొత్త ఆశయాలతో విద్యాభ్యాసాన్ని ప్రారంభిస్తున్న ఈ సందర్భంగా వారి భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు. విద్యార్థులు స్వేచ్ఛగా చదువుకుంటూ ఉపాధ్యాయులు బోధించే పాఠాలను శ్రద్ధగా నేర్చుకోవాలని, కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. తోటివారితో స్నేహపూర్వకంగా మెలుగుతూ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, రోడ్లు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు ఏకాగ్రతతో వ్యవహరించాలని తెలిపారు. విద్యా సంవత్సరంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సోషల్ మీడియాలో అనవసరంగా ఎక్కువ సమయం గడపడం వల్ల చదువుపై ప్రభావం పడుతుందని హెచ్చరించారు. లక్ష్య సాధనపై పూర్తి దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్, మాదకద్రవ్యాలు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలని, అవి ఆరోగ్యాన్ని, భవిష్యత్తును దెబ్బతీస్తాయని అన్నారు. చెడు స్నేహాలకు దూరంగా ఉండి మంచి అలవాట్లను అలవరచుకోవాలని కోరారు. సైబర్ భద్రత విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆయన, తెలియని వ్యక్తులు పంపే లింక్‌లను క్లిక్ చేయరాదని, వ్యక్తిగత లేదా బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని చెప్పారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్రమశిక్షణే విద్యార్థుల విజయానికి అసలైన ఆయుధమని పేర్కొన్న ఇన్‌స్పెక్టర్ నరహరి, ఈ విద్యా సంవత్సరం ప్రతి విద్యార్థికి విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.

More articles

Latest article