. . . నీట్ పేపర్ లీక్ బాధ్యులను కఠినంగా శిక్షించాలి
. . . పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.అనిల్ కుమార్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
విద్యార్థులకు భారత రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కులను కేంద్ర ప్రభుత్వం పరిరక్షించాలని పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.అనిల్ కుమార్ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు తమ హక్కుల సాధన కోసం చేపడుతున్న ఉద్యమానికి సంఘీభావంగా బుధవారం నవీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్ యు) ఆధ్వర్యంలో విద్యార్థులు నల్ల బ్యాడ్జీలతో కళ్లకు గంతలు కట్టి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి.నసీర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసిన నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారందరినీ వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనల నేపథ్యంలో మానసిక వేదనకు గురై ప్రాణాలు కోల్పోయిన సుమారు 22 మంది విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని, ప్రతి కుటుంబానికి రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని కోరారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పారదర్శకమైన పరీక్షా వ్యవస్థను అమలు చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఎ)ను రద్దు చేసి విశ్వసనీయమైన ప్రత్యామ్నాయ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో నీట్ పేపర్ లీకేజీ, పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలు, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై సమగ్ర చర్చ జరిపి తగిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంతో పరిగణించి విద్యార్థులకు న్యాయం జరిగేలా జోక్యం చేసుకోవాలని, విద్యార్థుల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో పీడీఎస్ యు జిల్లా నాయకులు రెహన్, నవీపేట్ మండలం నాయకులు అశోక్, ఇమ్రాన్, అయాన్, రాజు, వైష్ణవి, అభి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
