. . . పి.డి.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
విద్యార్థులకు ఎన్నికలు నిర్వహిస్తామని విద్యార్థి లోకానికి ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని, తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలని పి.డి.ఎస్.యు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ అన్నారు. నగరంలోని శ్రామిక భవన్ లో బుధవారం పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగం పట్ల అనుసరిస్తున్న విధానాల వలన విద్యా ప్రమాణాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయన్నారు. విద్యా రంగ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో 10%, రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గత 38 సంవత్సరాలుగా విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం, ప్రజాస్వామిక లక్షణాలు, సమాజం పట్ల సరైన రాజకీయ అవగాహన కొరవడుతున్నదని తెలిపారు. విద్యా సంస్థల్లో కులం, మతం, ప్రాంతం, భాష, లింగ వివక్షత లాంటి అసమానతలకు తావు లేకుండా సుప్రీంకోర్టు సూచనల మేరకు 2006లో జే.యం. లింగ్డో యు.జి.సి. వివిధ విశ్వవిద్యాలయాల రూల్స్ కు అనుగుణంగా విద్యార్థులకు ఎన్నికలు ఉండాలని సిఫారసులు చేశారాని గుర్తు చేశారు. విద్యార్థి దశలో నీతి, నిజాయితీ, నిస్వార్థ ఆలోచనలు కలిగి ఉండే విద్యార్థులకు ఎన్నికలు నిర్వహిస్తే రేపటి భవిష్యత్తుకు స్వచ్ఛమైన రాజకీయ నాయకులను విద్యాసంస్థలు అందిస్తాయన్నారు. దీంతో సమాజం పట్ల అవగాహన, బాధ్యతతో కూడిన నికార్సైన నాయకత్వం ప్రజలకు అందుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో నియమించిన తెలంగాణ విద్యాశాఖ కమిషన్ రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, సభ్యులు ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వర రావు సూచనల మేరకు విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కర్క గణేష్, ఎల్.అనిల్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే అషూర్, నితిన్, ఎండి.నసీర్, జిల్లా సహాయ కార్యదర్శులు వినోద్, సృజన్, కోశాధికారి అయాన్, జిల్లా నాయకులు రేహాన్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.
