- అధికారుల అనుమతి లేకుండా మాంత్రికుడి వద్ధకు కేజిబివి విద్యార్థిని
- సిఆర్టి బంగారు గొలుసు మాయం నేపథ్యంలో మాక్లూర్ కేజిబివిలో దారుణం
- వివాదాల పుట్టైనా మాక్లూర్ కేజిబివిలో కొత్త వివాదం
నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో ఒక కేజిబివిలో దారుణం జరిగింది. సైన్స్, విజ్ఞానం గురించి బోధించే ఉపాధ్యాయులు బంగారు గొలుసు పోయిందని మూఢనమ్మకాల తో మాంత్రికుల వద్ధకు తీసుకువెళ్లి విద్యార్థినిలను వేధించారు. ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. మాక్లూర్ కేజిబివిలో జరిగిన దారుణ అమానుష సంఘటన కు సంబందించిన బాధిత విద్యార్థినిల వీడియోలు విద్యార్థి సంఘాలు, బాధితులు సొషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మాక్లూర్ కేజిబివిలో ఒక మహిళ సిఆర్ టికి సంబందించిన బంగారు గొలుసు పోయింది. అందుకు అందరు విద్యార్థినిలను అసెంబ్లీ చేసి బంగారు గొలుసును తీసింది ఎవ్వరు అని అందరిని చెడామడా తిట్టారు. ఇద్దరు విద్యార్థలు అందుకు బాధ్యులని తోటి విద్యార్థిని ముందే మండిపడింది. అంతటితో ఉరుకోకుండా ఆరవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని నందిపేట్ మండలంలోని ఒక దర్గాకు తీసుకువేళ్లి మసిపూసి పొర్లు దండాలు పెట్టించినట్టు తెలిసింది. అంతటితో ఉరుకోకుండా వారే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. విద్యార్థినిలను అధికారుల అనుమతి లేకుండా దారుణంగా బయటకు తీసుకువెళ్లి వేధించిన ఉధంతంలో కేజిబివి అధికారుల పాత్ర ఉందని బహిరంగ ఆరోపణలు ఉన్నాయి.మాక్లూర్ కేజిబివి ఇటీవల కాలంలో వివాదాల పుట్టగా మారింది. సంబంధిత వివాదంపై జిసిడిఓ ఆధ్వర్యంలో జరిగిన విచారణ కొలిక్కి రాకముందే మరో వివాదం వెలుగు చూసింది. నిజామాబాద్ కు చెందిన అధికార పార్టీకి చెందిన ఒక కార్పొరేషన్ చైర్మెన్ మాక్లూర్ కేజిబివి వివాదంలో విద్యాశాఖాధికారుల చర్యలకు మోకాలడ్డుతున్నట్టు గుస గుసలు ఉన్నాయి. మాక్లూర్ కేజిబివిలో బంగారు గొలుసు పోయిందని చిన్నారులను మాయలు మంత్రాగాళ్ల చుట్టూ తింపిన వివాదంపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. బాధ్యులైన వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాక్లూర్ కేజిబివిలో వెలుగు చూసిన వివాదంపై జిల్లా విద్యాశాఖాధికారి దుర్గా ప్రసాద్ ను ’బతుకమ్మ‘ వివరణ కోరగా తనవద్దకు ఎలాంటి ఫిర్యదు రాలేదని, ఆ విషయం తనకు తెలియదని తెలిపారు.
