. . . ధాన్యం కొనుగోళ్ళను పూర్తి చేసి రైతులను ఆదుకోవాలి
. . . ఎఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
రోజురోజుకు ఎండలు తీవ్రమవుతున్న ఈ సమయంలో జిల్లా వ్యాప్తంగా వరి కొనుగోలు జోరు అందుకుంటున్న ఈ సందర్భంలో అకస్మాత్తుగా రైతులకు ముందస్తు సమాచారం ఏమి ఇవ్వకుండా దాన్యం కొనుగోళ్లను (కంటాలను) ఆపేసారని ఎఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. వెంటనే ఆగిపోయిన కంటాలను ప్రారంభించి ధాన్యం కొనుగోలును పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. శనివారం తాడెం గ్రామంలోని దొడ్డి కొమురయ్య స్మారక ట్రస్ట్ భవనంలో ఎఐకెఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ సివిల్ సప్లై, పిఎసిసి లు, ఐకెపి తదితర కొనుగోలు సంస్థలు ఒక్కసారి ఫీల్డ్ లో కొనుగోలు కేంద్రాల వద్ద రైతు ముందు తూకం వేసిన ధాన్యానికి అక్కడే రైతులకు రసీదు ఇవ్వాలని అన్నారు. ఆ రసీదు ప్రకారం 48 గంటల్లో రైతు ఖాతాలో ధాన్యం డబ్బులు జమ చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. తూకం తర్వాత ప్రకృతి వైపరీత్యాలు, తలు, తరుగు ఇతర ఏ కారణాల చేతనైన ధాన్యం కాంటలైన తర్వాత రైతులకు సంబంధం ఉండదని దాని బాధ్యత అంతా కూడా ఆయా కొనుగోలు సంస్థలదే అని అన్నారు. ప్రభుత్వం తమకు నచ్చిన విధంగా కొత్త కొత్త విధానాలు, యాప్ లు తెస్తున్నారని, అప్పుచేసి ఆరుగాలం కష్టపడి రైతు పండించిన పంటను అమ్ముకునే సమయంలో తీవ్ర ఇబ్బందులకు ఆందోళనకు గురి చేయడం ప్రభుత్వానికి ఏమాత్రం సరైంది కాదని అన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో తగినన్ని టెంట్లు ఏర్పాటు చేయాలని, మంచినీళ్లు ఇతర సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐకెఎంఎస్ నాయకులు వి.గంగారం, రమేష్, భుజేందర్ తదితరులు పాల్గొన్నారు.
