- మూడు గేట్లు ఎత్తడంలో విఫలం
- 5లక్షల క్యూసెక్కుల వరద వస్తున్న మొత్తం గేట్ల ఎత్తడంలో వైఫల్యం
- గతేడాది మరమ్మత్తులు జరిగినా ఫలితం శూన్యం
నిజామాబాద్, బతుకమ్మ : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ప్రతి సీజన్ లో వచ్చే కష్టమే రిపీట్ అవుతుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ప్రతి వానకాలంలో లక్షల క్యూసెక్కుల వరద రావడం, ప్రాజెక్టు నిండడం సర్వసాధారణం. ఇటీవల కాలంలో గత మూడు సంవత్సరాలుగా ఆగస్టు మాస్టంలో ప్రాజెక్టు నిండడం, లక్షల క్యూసెక్కులను దిగువకు వదలడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రాజెక్టు 42 గేట్లను ఎత్తి గోదావరి నదిలోకి వదిలే సాంప్రదాయం కొనసాగుతుంది. అయితే గత కొంత కాలంగా ప్రాజెక్టు పూర్తి గేట్లు ఎత్తడంలో వైఫల్యం ఎదురవుతుంది. ఎందుకంటే ప్రాజెక్టుకు ఇటీవల కాలంలో మరమ్మత్తులు గడిచిన ఎండకాలంలో నిర్వహించారు. అందుకు కోట్ల రూపాయలను వెచ్చించారు. మరమ్మత్తులు చేయడంతో పాటు గ్రీస్ లైన్ పనులను కూడా చేపట్టారు. అయితే మరమ్మత్తులు చేశారు కానీ వర్షాకాలంలో మాత్రం గేట్లు మొరాయించడం మాత్రం తప్పడం లేదు. ప్రస్తుతం ప్రాజెక్టుకు సంబంధించిన 39 గేట్లు మాత్రమే ఎత్తుతున్నారు. మిగిలిన 3 గేట్లు మొరాయించడంతో మిగిలిన 38 లేదా 39 గేట్లను మాత్రమే ఎత్తి లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 80.5 టీఎంసీలకు గాను ప్రస్తుతం 65.865 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. అయితే ప్రాజెక్టు పూడిక తొలగింపును గత కొన్ని రోజులుగా చేయకపోవడంతో పాటు శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ కారణంగా పలు గ్రామాలు ముంపునకు గురవడం పంటలు మునిగిపోవడంతో ప్రాజెక్టులో తక్కువగా నీటిని ఉంచుతున్నారన్న వాదనలున్నాయి. ప్రాజెక్టుకు ఆదివారం ఉదయం 5,90,701 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. అయితే ఉదయం 38 గేట్ల ద్వారా 4 లక్షల 93 వేల 877 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఆగస్టు మాసంలో 15 తర్వాత ప్రాజెక్టు గేట్లను ఎత్తడం ప్రారంభించారు. కొన్ని రోజులుగా ప్రాజెక్టు మొత్తం గేట్లను ఎత్తేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సంవత్సరం జూన్ 1 నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 278.573టీఎంసీల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చింది. ఆదివారం వరకు ప్రాజెక్టు నుంచి 225.568 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఆదివారం సాయంత్రం ప్రాజెక్టుకు 3 లక్షల 70 వేల ఇన్ ఫ్లో వస్తుండగా 38 గేట్ల ద్వారా 3 లక్షల 26 వేల 853 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్ల మరమ్మత్తుల విషయంలో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గత కొన్ని రోజులుగా మరమ్మత్తులు చేసినా స్పిల్ వే గేట్లను ఎత్తడంలో వైఫల్యంపై అధికారుల మాటలకు అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు పొంతన కుదరడం లేదన్న వాదనలున్నాయి. కోట్ల రూపాయలు వెచ్చించి మరమ్మత్తు చేసిన గేట్లు నెలల వ్యవధిలో ఎలా పని చేయడం లేదన్న వాదనలున్నాయి. ప్రదానంగా ప్రాజెక్టుకు ఇటీవల కాలంలో 5 లక్షల క్యూసెక్కుల వరద 10 రోజులుగా వస్తూనే ఉంది. అధికారులు గోదావరి నదిలోకి 5 లక్షల పైచిలుకు నీటిని వదిలేందుకు ప్రయత్నిస్తుంటే గేట్లు మొరాయించడంతో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ కారణంగా గ్రామాలకు గ్రామాలే నీట మునిగాయి. 5 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునే విధంగా వరద గేట్లను ఎత్తడంలో వైఫల్యంపై ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ జగదీష్ ను వివరణ కోరగా చిన్న చిన్న మైనర్ రిపేర్ల కారణంగానే మూడు గేట్లు ఎత్తడంలో వైఫల్యం జరిగిందన్నారు. ఈ విషయంలో అపోహలకు తావులేదని అన్నారు. గేట్లను పూర్తి స్థాయిలో పని చేసే విధంగా సాంకేతిక టీం ఆధ్వర్యంలో పని చేస్తున్నామని తెలిపారు.

