నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: తెలంగాణ విద్యాశాఖ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుండి వేసవి ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ తరగతులు నిజామాబాద్ జిల్లా ఐలాపూర్, నందిపేట్, డొంకేశ్వర్ సహా అనేక పాఠశాలల్లో ప్రారంభమై, విద్యార్థుల నుంచి విశేష స్పందనను అందుకుంటున్నాయి. జడ్పీహెచ్ఎస్ ఐలాపూర్‌లో దేశ్పాండే ఫౌండేషన్, కాకతీయ సాండ్ బాక్స్, స్కిల్ ఇన్ విలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తరగతుల్లో 5వ నుండి 8వ తరగతి విద్యార్థులకు సైన్స్, గణితం, ఆర్ట్స్, లైఫ్ స్కిల్స్ లాంటి విషయాలు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ విధానంలో బోధిస్తున్నారు. ఇది విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను పెంపొందించడంలో కీలకంగా మారుతోంది. ఉదయం 8:00 నుండి 9:30 వరకు 5వ, 6వ తరగతులకు, 9:30 నుండి 11:00 వరకు 7వ, 8వ తరగతులకు తరగతులు నిర్వహిస్తున్నారు. ట్రైనర్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో ఈ తరగతులు సజావుగా సాగుతున్నాయి. ఈ తరగతులు విద్యార్థుల భవిష్యత్తుకు దోహదం చేస్తాయని, ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కావాలని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నారు. ఐలాపూర్ ప్రధానోపాధ్యాయులు లాలయ్య ఈ తరగతుల ప్రాముఖ్యతను వివరించారు.
