27.8 C
Hyderabad

డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక దాడులు కొనసాగించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలి

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నందిపేట్, బతుకమ్మ :

 

డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు, పేకాట, గుట్కా, ఇసుక, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిరంతర దాడులు నిర్వహించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పరిష్కారం, శాంతిభద్రతల పరిరక్షణపై సీపీ గురువారం సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. నందిపేట్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ సమావేశంలో ఆర్మూర్ ఏసీపీతో పాటు సీఐలు, ఎస్‌హెచ్‌ఓలు, ఎస్సైలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అక్రమ రవాణాలో పాల్గొనే వ్యక్తులపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ఆన్‌లైన్ మోసాలకు గురైన బాధితులకు తక్షణమే స్పందించి సహాయం అందించాలని తెలిపారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో నమోదైన హత్య, హత్యాయత్నం, చోరీలు, మహిళలపై నేరాలు, సైబర్ మోసాలు, డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా తదితర కేసుల పురోగతిని కమిషనర్ సమీక్షించారు. పెండింగ్ కేసులను వేగంగా దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాత నేరస్థులు, రౌడీషీటర్లు, బెయిల్‌పై విడుదలైన నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, రాత్రి పహారా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలను కట్టుదిట్టంగా నిర్వహించాలని తెలిపారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, షీ టీమ్స్, ఈగల్ టీమ్స్, చీతా ఫోర్స్ మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లలో ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని కమిషనర్ సూచించారు. రిసెప్షన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ, స్టేషన్ పరిశుభ్రత, సిబ్బంది క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని సూచించారు. ఆర్మూర్ డివిజన్‌లో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్‌స్పాట్లుగా గుర్తించి సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని, హైవేలకు అనుసంధానంగా ఉన్న లింక్ రోడ్ల వద్ద అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయించాలని సూచించారు. రోడ్లకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించడంతో పాటు రోడ్డు ఇంజినీరింగ్ లోపాలను గుర్తించి నేషనల్ హైవే, స్టేట్ హైవే అధికారులు, ఇతర సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

 

Special raids to eradicate drugs must continue.

 

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని, ఓవర్‌స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు రోడ్డు భద్రతా నిబంధనలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వెంటనే పోలీసుల సహాయం పొందేందుకు ఉపయోగపడే డయల్ 112 సేవపై విస్తృత ప్రచారం నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ సేవ గురించి ప్రతి వర్గం ప్రజలకు అవగాహన కల్పించేలా నిరంతరం కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. వాహనాల తనిఖీలను 24 గంటలూ కొనసాగించాలని, తనిఖీల సమయంలో సిబ్బంది ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యాన్ని సహించబోమని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సీసీఆర్‌బీ ఏసీపీ గురునాయుడు, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ ఆర్. అంజయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలు, ఎస్సైలు, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Special raids to eradicate drugs must continue.

More articles

Latest article