. . . పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలు
. . . నగర పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య వెల్లడి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
పదవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయబడుతుందని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్ సమీపంలో మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు నిర్వహించబడనున్న పదో తరగతి (ఎస్ ఎస్ సీ) పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరఫున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జిల్లాలోని మొత్తం 144 పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ (పాత సెక్షన్ 144 సిఆర్‌పిసి) అమలులో ఉంటుందని వెల్లడించారు. పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుంపులుగా చేరడం నిషేధమని, అలాగే పరీక్షా కేంద్రాల సమీపంలో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు లేదా మైకులు, డిజేలతో ఊరేగింపులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు కేంద్రాల సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని సంబంధిత యజమానులకు సూచనలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాలలోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్ పరికరాలు, నిషేధిత వస్తువులు తీసుకురావడానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షలు రాసే విద్యార్థులందరూ ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షిస్తూ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య విద్యార్థులకు “ ఆల్ ది బెస్ట్ ” తెలిపారు.
