. . . మాదిగలకు రాజ్యసభ లో సీటు కేటాయించాలి
. . . ఎంఆర్ పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు రొడ్డ ప్రవీణ్ మాదిగ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణలో ఖాళీ అవ్వబోతున్న 2 రాజ్యసభ సీట్లలో మాదిగలకు ఒక సీటు కేటాయించాలని, రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని పాటించాలని ఎంఆర్ పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు రొడ్డ ప్రవీణ్ మాదిగ అన్నారు. జిల్లా కేంద్రంలో ఎంఆర్ పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రొడ్డ ప్రవీణ్ మాదిగ అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల మొదటి వారంతో తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అవబోతున్న రెండు రాజ్యసభ సీట్లలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఒక సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2024 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మూడు ఎస్సీ రిజర్వ్ డ్ లోకసభ స్థానాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఒకటి కూడా మాదిగలకు కేటాయించలేదని, దాని వల్ల మాకు లోకసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయిందని తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కులం మాదిగలు అయితే ఆ మాదిగలకు ఒక సీటు కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందన్నారు. ప్రస్తుతం రాజ్యసభలోనైనా మాదిగలకు సీటు కేటాయించాలని లేకపోతే మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సామాజిక న్యాయం కాపాడే అవకాశం వచ్చిందని మాదిగల తరుపున గుర్తు చేశారు. ఇప్పటికే లోక సభ లో ఏడుగురు రెడ్డి లు ఉన్నా కూడా రేపు రాజ్యసభకు కూడా పోటీపడతారని, ఖాళీ అయ్యే రెండిట్లో ఒకటి మాదిగలకు ఇచ్చి రెండోది ఎవరికి ఇచ్చుకున్న మాకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ, ఎంఎస్ పీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సరికేల పోశెట్టి మాదిగ, ఎంఆర్ పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు గంధమల నాగభూషణ్ మాదిగ, ఎంఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు తెడ్డు గంగారాం మాదిగ, ఎంఈఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాంపల్లి మాదిగ, ఎంఎంఎస్ జాతీయ నాయకురాలు యమున మాదిగ, ఎంఆర్ పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లాసింగారి భూమయ్య మాదిగ, ఎంఎంఎస్ జిల్లా నాయకులు పద్మ మాదిగ, సుధ మాదిగ, ఎంఆర్ పీఎస్ జిల్లా కార్యదర్శి పోశెట్టి మాదిగ, ఎంఆర్ పీఎస్ మండల అధ్యక్షులు మోహన్ మాదిగ, మాదిగ లాయర్స్ ఫెడరేషన్ జిల్లా నాయకులు సుజిత్ కుమార్, ఎంఆర్ పీఎస్ నాయకులు సత్యం మాదిగ తదితరులు పాల్గొన్నారు.
