సెంటర్ పాయింట్ అయిన సివంగి

0 85,681
  • కేసీఆర్ కు కవిత బహిరంగ లేఖ
  • ఉద్యమ నేతకు దిశానిర్దేశమా..? ధిక్కార స్వరమా..?

 

నిజామాబాద్, బతుకమ్మ: బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు నడుస్తోందని అధికార కాంగ్రెస్ తోపాటు బీజేపీ అంటున్న తరుణంలో ఎమ్మెల్సీ కవిత తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ కు బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. తెలంగాణ సాధనే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిన నాటి నుంచి కేసీఆర్ ఎంతో మంది నాయకులతో కలిసి పయనించారో అంతే మంది నాయకులతో దూరమయ్యారు. ఒక దశలో ఒంటరి అయ్యారని అంతా అనుకున్న తరుణంలో పిడికిలి బిగించి ముందుకు వచ్చిన ఆయన యావత్ తెలంగాణ సమాజంలో ఉత్సాహాన్ని నింపారు. అయితే సందర్భానుసారంగా స్పందించడం, పొలిటికల్ టార్గెట్ ను పక్కాగా రీచ్ కావడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని అటు సొంత పార్టీ నాయకులతోపాటు ఇతర పార్టీల నాయకులు ఒప్పుకుంటారు. ఆ స్థాయి ఉన్న కేసీఆర్ కు ఇప్పుడు కవిత బహిరంగ లేఖరాయడం, కొన్ని అంశాలపై కేసీఆర్ స్పందించిన  తీరును ఎత్తి చూపడంపై అటు రాజకీయ విశ్లేషకులు, ఇటు సామాన్యులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

తెలంగాణ అంటేనే బీఆర్ఎస్.. బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ అని గట్టిగా చెప్పే కేసీఆర్ ప్రసంగంలో పంచ్ మిస్సయ్యిందని కవిత లేఖలో పేర్కొన్నారు.  వక్ఫ్ బిల్లు, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై మాట్లాడితే బాగుండేదని, బీజేపీపై విరుచుకుపడాల్సిందని లేఖలో రాశారు.

  • ధిక్కార స్వరమా..?

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేతగా దేశం దృష్టిని ఆకర్షించిన కేసీఆర్ కు కవిత దిశానిర్దేశం చేస్తున్నారా? లేక ధిక్కార స్వరం వినిపిస్తున్నారా? ఆ పార్టీలోని సీనియర్లు అటున్నారు. కేసీఆర్ తో చర్చించేందుకు కవిత రాసుకున్న నోట్ లీక్ అయ్యిందా? లేదా ఆమె నిజంగానే లేఖ రాశారా? అనేది పక్కన పెడితే.. ప్రస్తుతానికి ఆమె బీఆర్ఎస్ లో సెంటర్ పాయింట్ అయ్యారు. బీఆర్ఎస్ లో మూడు ముక్కలాట సాగుతోందని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇప్పటికే విశ్లేషిస్తున్నారు. కవిత, కేటీఆర్, హరీశ్ రావు పార్టీని లీడ్ చేసేందుకు తహతహ లాడుతున్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ కు కవిత లేఖ రాయడం ధిక్కార స్వరమా? లేక కేటీఆర్, హరీశ్ రావులను వెనక్కి నెట్టేందుకా? అనే చర్చ మొదలైంది. పార్టీ ప్రారంభించిన కాలం నుంచి వెన్నంటి ఉన్న నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు రజతోత్సవ సభలో మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేది అని కవిత లేఖలో పేర్కొన్నారు.

  • తన బాధ.. పార్టీ బాధ కాలేదనే అసహనమా..?

లిక్కర్ స్కామ్ లో తనను జైలుకు పంపిన బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేయలేదనే అసహనం కవితలో కనిపిస్తోందని రాజకీయ నాయకులు అంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ పై నమ్మకం పోయిందని అంటూనే మన పార్టీ కేడరే బీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం అవుతోందని అంటున్నారని, ఈ తరుణంలో బీజేపీని టార్గెట్ చేయాల్సిందని కవిత లేఖలో అభిప్రాయపడ్డారు. అయితే తనను టార్గెట్ చేసిన బీజేపీని తమ పార్టీ టార్గెట్ చేయలేకపోయిందని, ఈ కారణంతోనే కవిత తీవ్ర అసహనానికి లోనవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీని విమర్శించకపోవడంతో మనమే ఆ పార్టీకి హెల్ప్ చేసినట్లవుతోందని, భవిష్యత్ లో పొత్తు దిశగా వెళ్తారనే సంకేతాలు వెళ్లాయని కవిత లేఖలో పేర్కొన్నారు.

  • ఓ వైపు రామన్న.. మరో వైపు కవితక్క

బీఆర్ఎస్ కు ఉమ్మడి జిల్లాలో మంచి పట్టు ఉన్న విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ తోపాటు కేటీఆర్, కవితతో ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలకు, ద్వితీయ శ్రేణి నాయకులు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. పార్టీలో ఆధిప్యత పోరు నడుస్తోందని ఎదుటి పార్టీలు విమర్శలు చేస్తున్న తరుణంలో కవిత లేఖ అయోమయానికి గురి చేస్తోంది. మాజీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ద్వితీయ శ్రేణి నాయకులు ఓ వైపు రామన్న.. మరో వైపు కవితక్క.. మా పరిస్థితి ఏమిటని లోలోన గునుక్కుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.