. . . సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
దేశంలో మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాడుతూ, కమ్యూనిస్టు సిద్ధాంతాల ఆధారంగా సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం కోసం సీతారాం ఏచూరి నిరంతరం కృషి చేశారని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రమేష్ బాబు అన్నారు. కమ్యూనిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి 74వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ దేశంలో బీజేపీ కమ్యూనిస్టు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సమయంలో పార్లమెంట్‌లో కమ్యూనిస్టుల గొప్పతనాన్ని, వారి పోరాట పటిమను చాటిన నాయకుడు ఏచూరి అని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కమ్యూనిస్టు పార్టీలను ఐక్యం చేయడంలో, సోషలిస్టు భావజాలాన్ని విస్తరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని రమేష్ బాబు తెలిపారు. విద్యార్థి దశ నుంచే వామపక్ష భావజాలాన్ని అలవర్చుకున్న ఏచూరి, విద్యార్థుల సమస్యలను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ధైర్యంగా ప్రశ్నించారని గుర్తుచేశారు. సీతారాం ఏచూరి ఆశయాల సాధన కోసం, దేశంలో సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం లక్ష్యంగా సీపీఎం నిరంతరం కృషి చేస్తుందని రమేష్ బాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు విగ్నేష్, నగర కమిటీ సభ్యులు అనసూయమ్మ, ఉద్దవ్, అనిత, నాయకులు అంజయ్య, రాజు, మాధవి, గోవిందు తదితరులు పాల్గొన్నారు.
