. . . భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్టుకు సన్నాహాలు
. . . సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి
హైదరాబాద్, బతుకమ్మ :
సింగరేణి సంస్థను బహుముఖంగా విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలోకి ప్రవేశించే అవకాశాలను సంస్థ పరిశీలిస్తోంది. ఈ మేరకు ఉప ఉత్పత్తుల తయారీతో పాటు ప్రత్యామ్నాయ ఇంధన రంగాల్లో అవకాశాలను అన్వేషిస్తున్నట్లు సింగరేణి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి తెలిపారు. శనివారం సింగరేణి భవన్‌లో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ నాగులపల్లి శ్రీకాంత్‌తో జరిగిన సమావేశంలో కోల్ గ్యాసిఫికేషన్‌కు సంబంధించి సింగరేణి చేపడుతున్న చర్యలను సీఎండీ వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి మాట్లాడుతూ, సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాంగణంలో రోజుకు 400 టన్నుల సామర్థ్యంతో అమ్మోనియం నైట్రేట్ మెల్ట్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ అధ్యయనం నిర్వహించినట్లు తెలిపారు. అయితే ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రాజెక్టు పెట్టుబడిపై రాబడి ఆశాజనకంగా లేదని, దీనిని మెరుగుపరిచేందుకు ప్లాంట్ సామర్థ్యం పెంపు, కేంద్ర ప్రభుత్వ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ వినియోగం, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోని ఇతర కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల అనుభవాలను అధ్యయనం చేసేందుకు సింగరేణి అధికారుల బృందం త్వరలో తాల్చేర్, ఎంసీఎల్–బీహెచ్ఈఎల్, జేఎస్పీఎల్ తదితర ప్రాజెక్టులను సందర్శించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా భీమారం, చెన్నూరు సౌత్, నైనీ ప్రాంతాల్లో సర్ఫేస్ కోల్ గ్యాసిఫికేషన్ అవకాశాలపై సాంకేతిక, ఆర్థిక విశ్లేషణ కొనసాగుతోందని చెప్పారు. భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ (అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్) పైలట్ ప్రాజెక్టుకు కూడా సింగరేణి సన్నాహాలు చేస్తోంది. బెల్లంపల్లి, రామగుండం ప్రాంతాల్లోని లోతైన బొగ్గు నిల్వల్లో ఐదు బ్లాక్‌లను గుర్తించినట్లు సీఎండీ తెలిపారు. తొలి పైలట్ ప్రాజెక్టును బెల్లంపల్లి డిప్‌సైడ్ బ్లాక్‌లో చేపట్టేందుకు డ్రిల్లింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయని, సీఎంఐఎఫ్‌ఆర్ శాస్త్రవేత్తల సాంకేతిక మార్గదర్శకత్వంలో ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో సింగరేణి డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ (ఆపరేషన్స్), కె. వెంకటేశ్వర్లు (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్), గౌతమ్ పోట్రు (పర్సనల్ అండ్ ఫైనాన్స్), ఈడీ (కోల్ మూవ్‌మెంట్) బి. వెంకన్న, జీఎం (కోఆర్డినేషన్ అండ్ మార్కెటింగ్) టి. శ్రీనివాస్, జీఎం (పీపీ) జి. దేవేందర్, జీఎం (బిజినెస్ డెవలప్‌మెంట్) రాందాస్, జీఎం (ఆర్ అండ్ డీ) వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
