27.1 C
Hyderabad
Sunday, August 2, 2026

సమ్మోహన ఖాకీలు

Must read

📰 Generate e-Paper Clip

. వల విసిరి.. ఉచ్చులో చిక్కుతున్న వైనం

. ఇప్పటికే వివాదాస్పదమైన పలువురు అధికారులు

నిజామాబాద్, బతుకమ్మ: న్యాయం కోసం వచ్చే మహిళలపై పలువురు పోలీసు అధికారులు సమ్మోహన అస్ర్తాన్ని ప్రయోగిస్తున్నారు. చివరకు వారు విసిరిన వలపు వలలో.. వారే చిక్కుకుని తమతోపాటు తమ డిపార్ట్ మెంట్ పరువును బజారుకీడుస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగుచూశాయి. ఇప్పటికే కళాశాలల అమ్మాయిలు ఇద్దరిని ఇద్దరు పోలీసు అధికారులు వలలో వేసుకున్న ఘటనలు వెలుగుచూసి ఫిర్యాదుల వరకు వెళ్లగా, భార్యాభర్తల వివాదంలో తలదూర్చిన ఓ అధికారి సదరు మహిళను లోబర్చుకుని గర్భవతిని చేయగా, ఉన్నతాధికారులు అతడిపై బదిలీ వేటు వేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో వెలుగుచూసిన ఈ ఘటనలు శాఖ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. పోలీసు అధికారులపై ఏకంగా లోకాయుక్తకు ఫిర్యాదులు వెళ్తుండడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళలు, యువతులకు వల విసిరి బజారునపడ్డ ముదుర్లపై ఇప్పటికీ శాఖాపరమైన చర్యలు తీసుకోకపోగా, అంతర్గతంగా విచారణ చేపట్టిన దాఖలాలు లేవు. పోలీసుశాఖ పరువు పోతుందనే కారణంతో ఉన్నతాధికారులు ‘సమ్మోహన’ పోలీసులను చూసీచూడనట్లు వదిలేయడంతోపాటు బాధితులనే బెదిరించిన ఘటనలతో మరికొన్ని వెలుగుచూడలేదు.

లోకాయుక్తకు చేరిన పంచాయితీ..

తనపై కక్షగట్టి అక్రమంగా కేసు నమోదు చేశారని ఓ యువకుడు సీఐ, ఎస్సైతోపాటు కానిస్టేబుల్  పై లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. దీనికి వెనకాల ప్రేమ వ్యవహారం ఉంది. నగరంలోని ఓ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న సమయంలో ఓ యువతి లెక్చరర్ కు డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బులను తిరిగి ఇవ్వడంలో లెక్చరర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో యువతి తనకు తెలిసిన యువకుడి ద్వారా అప్పట్లో నగరంలోని ఓ సీఐని కలిసింది. సదరు సీఐ లెక్చరర్ ను పిలిపించి యువతి ముందే డబ్బులు వాపస్ చేయాలని బెదిరించాడు. అంతటితో ఆగకుండా యువతి మొబైల్ నంబర్ తీసుకుని వాట్సాప్ చాటింగ్, కాల్స్ మొదలు పెట్టాడు. ఇంటర్ చదివే కొడుకున్న సీఐ 18 ఏళ్ల వయస్సు అమ్మాయిని ట్రాప్ చేసే ప్రయత్నం చేశాడు. పొద్దున లేచింది మొదలు తాను ఏం చేస్తున్నది, ఎక్కడ ఉన్నది అన్నీ ఆమెతో వాట్సాప్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ఇదంతా తెలిసిన యువకుడు భయపడి అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో యువడిపై కక్ష గట్టిన సీఐ సమయం కోసం వేచి చూశాడు. యువకుడికి ఓ కానిస్టేబుల్ కూతురితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తెలుసుకున్నాడు. కానిస్టేబుల్ కు విషయం చెప్పి సదరు యువకుడిపై చైన్ స్నాచింగ్ ఫిర్యాదు చేయించాడు. సీఐ ఆదేశించడంతో ఎస్సై యువకుడిపై కేసు నమోదు చేశాడు. తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని యువకుడు అప్పటి సీపీ కి  ఫిర్యాదు చేయగా, ఇరువురిని మందలించినట్లు సమాచారం. అయినప్పటికీ సీఐ వేధింపులు ఆపకపోవడంతో యువకుడు లోకాయుక్తకు ఫిర్యాదు చేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో ఎస్సై బలయ్యారని శాఖ అధికారులు, సిబ్బంది  అంటున్నారు. సీఐ, ఎస్సైలు సంబంధిత సర్కిల్ నుంచి బదిలీ అయినప్పటికీ కేసు తాలూకు వివాదం వెంటాడుతోంది.

బండి పోయిందని వెళ్తే..

ఎంబీబీఎస్ చదువుతున్న ఓ అమ్మాయి తన బండి పోయిందని ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, ఆమె నంబర్ తీసుకున్న మరో సీఐ తనతో వాట్సాప్ చాటింగ్, కాల్స్ ప్రారంభించాడు. కేసు విషయం మాట్లాడుతూనే ఆమెతో సన్నిహితంగా మెలగడం ప్రారంభించాడు. ఈ ఇద్దరి వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  ఓ వీడియో సైతం బయటికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని పసిగట్టిన సీఐ భార్య నిజమేమిటో తెలుసుకునేందుకు రంగంలోకి దిగింది. ఎంబీబీఎస్ విద్యార్థినికి దోస్త్ అయిన రౌడీషీటర్ తనపై ఉన్న అరెస్ట్ వారెంట్ ను తప్పించుకునేందుకు సీఐ, విద్యార్థిని ఉన్న సంబంధాన్ని అవకాశంగా వాడుకున్నాడు. సీఐ భార్య విషయం తెలుసుకునేందుకు తన వద్దకు రావడంతో సదరు రౌడీ షీటర్.. సీఐని వెనుకేసుకురావడంతోపాటు యువతితో ఎలాంటి సంబంధం లేదని వివాదం పెద్దది కాకుండా చాకచక్యంగా వ్యహరించాడు. దీంతో అధికార యంత్రాంగం రౌడీషీటర్ పై చేసిన ఓ ఫిర్యాదును సీఐ బుట్టదాఖలు చేశాడు.  ఈ కేసు ప్రజల్లోకి వైరల్ కాకముందే సారు అక్కడి నుంచి బదిలీ చేసుకుని సేఫ్ అయ్యాడు.

భార్యాభర్తల గొడవలో తలదూర్చి..

నిజామాబాద్ నగరంలోని ఓ పోలీస్ స్టేషన్ లో కొన్నేళ్ల క్రితం సీఐగా పని చేసిన అధికారి భార్యాభర్తల గొడవలో కౌన్సిలింగ్ కోసం వచ్చిన మహిళను లోబర్చకుని ఏకంగా గర్భవతిని చేశాడనే ఆరోపణలున్నాయి. ఈ విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో సదరు అధికారిని బదిలీ చేసి విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డారనే ఆరోపణలున్నాయి.

కలకలం రేపిన ముగ్గురి మరణం..

కామారెడ్డి జిల్లా భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శ్రుతితోపాటు మరో యువకుడి మృతి రాష్ర్ట వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. గత నెలలో చోటు చేసుకున్న ఈ ముగ్గురి మరణానికి అసలు కారణం ఇప్పటికీ తెలియలేదు. కామారెడ్డి  జిల్లా సదాశివనగర్ మండలంలోని పెద్ద చెరువులో ముగ్గురి మృతదేహాలు లభించాయి. బీబీపేట స్టేషన్ లో పని చేస్తున్న కాలంలో ఎస్సై, కానిస్టేబుల్ తోపాటు సహకార సొసైటీ కంప్యూటర్ ఆపరేటర్ కు మధ్య పరిచయం ఉందని, ముగ్గురి మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీనే ముగ్గురి మరణాలకు కారణమని స్థానికులు అంటున్నారు. అయితే వీరిది ఆత్మహత్యా? లేక ఒకరినొకరు కాపాడబోయి ముగ్గురూ చనిపోయారా? అనేది ప్రశ్నగానే మిగిలింది.

More articles

Latest article